kvp: పోలవరం త్వరగా పూర్తి అవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తగు సూచనలు చేయండి.. ఏపీ స్పీక‌ర్ కు కేవీపీ ఉత్త‌రం!

  • ఏపీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌కు కేవీపీ లేఖ 
  • పోలవరం విషయంలో ఈ మధ్య మీకు కూడా "ఆసక్తి" పెరిగినట్లు కనిపిస్తోంది
  • మీడియాకు విడుద‌ల చేసిన ఏపీసీసీ రాష్ట్ర కార్యాల‌యం
ఏపీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌కు రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామ‌చంద్ర‌రావు తాజాగా మరో లేఖ రాశారు. ఈ మేరకు ఏపీసీసీ రాష్ట్ర కార్యాల‌యం నుంచి స్పీక‌ర్ కు కేవీపీ రాసిన లేఖను మీడియాకు విడుద‌ల చేశారు.

కేవీపీ లేఖ యథాతథంగా..

'పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఖర్చును విభజన చట్టం ప్రకారం కేంద్రమే భరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నేను హై కోర్ట్ లో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం లో కేంద్రం కౌంటర్ ఇంకా వేయలేదని నేను మీకు 5 సెప్టెంబర్ న రాసిన లేఖలో తెలిపి ఉన్నాను. కానీ, కాకతాళీయంగా అదే రోజు అంటే 05.09.2018న కేంద్ర జలవనరుల శాఖ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది, మా తరపు న్యాయవాదికి కేంద్రం తరపున హైకోర్టులో ఫైల్ చేస్తున్న కౌంటర్ కాపీని ఇచ్చినట్లుగా మా న్యాయవాది నాకు తెలిపి ఉన్నారు. కాబట్టి మీకు ఈ విషయం తెలియచేయడం నా ధర్మంగా భావించి ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నాను.

ఇదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, కేవలం "మెమో అఫ్ అప్పీయరెన్సు"తో సరిపెట్టకుండా.. విభజన చట్టం ప్రకారం, ఆ తరువాత యూపీఏ కాబినెట్ 01.05.2014న తీసుకొన్న నిర్ణయం ప్రకారం పోలవరం పూర్తి ఖర్చును కాస్ట్ ఎస్క్ లేషన్ భారంతో పాటు, 2013 నూతన భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, సహాయ పునరావాసాలపై అయ్యే అదనపు ఖర్చుతో సహా కేంద్రమే భరించేలా ఆదేశించి ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయమని కౌంటర్ దాఖలు చేస్తే.. ఆ కేసు త్వరగా విచారణకు వచ్చి రాష్ట్రానికి అనుకూల ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నది. కానీ, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది.

నేను ఇప్పటికే పలు లేఖల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని.. ఈ కేసులో రాష్ట్రం తరపున కౌంటర్ వేయించవలసినదిగా కోరి ఉన్నాను. కానీ, గౌరవ ముఖ్యమంత్రి ఎందుకో పోలవరం విషయంలో ఈ అదనపు భారాన్ని రాష్ట్రంపై వేయడంతో పాటు, ప్రాజెక్ట్ ఖర్చును ముందు రాష్ట్ర నిధుల నుంచి భరించి తరువాత కేంద్రం నుంచి రీయింబర్సు చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి కారణమేమిటో వారికే తెలియాలి.

ఇక పోలవరం విషయంలో ఈ మధ్య మీకు కూడా "ఆసక్తి" పెరిగి పోలవరం త్వరగా పూర్తి అవ్వాలని ఆశిస్తున్నట్లు కనబడుతున్నది కాబట్టి.. ఈ అదనపు ఖర్చు భారం రాష్ట్రంపై పడకుండా పోలవరం త్వరగా పూర్తి అవ్వడానికి (రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల విషయంలో) రాష్ట్ర ప్రభుత్వానికి తగు సూచనలు చేస్తారని' ఆశిస్తున్నట్లు కేవీపీ తన లేఖలో పేర్కొన్నారు.
kvp
shivaprasad
Andhra Pradesh
Chandrababu
Congress
Telugudesam

More Telugu News