nalini: రాహుల్ గాంధీకి జీవితాంతం రుణపడి ఉంటా: రాజీవ్ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని

  • తన తండ్రిని హత్య చేసిన మమ్మల్ని రాహుల్ క్షమించారు
  • నా కూతురు, తండ్రితో సంతోషంగా జీవించాలనుకుంటున్నా
  • కేంద్ర ప్రభుత్వం నా పట్ల దయ చూపుతుందని ఆశిస్తున్నా

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హృదయం చాలా విశాలమైనదని... జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న నళిని అన్నారు. రాహుల్ ది గొప్ప మనసు కాబట్టే... ఆయన తండ్రిని హత్య చేసిన మమ్మల్ని క్షమించారని... ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పారు. ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థతో ఉత్తరాల ద్వారా సంభాషిస్తూ ఆమె ఈ మేరకు రాహుల్ కు ధన్యవాదాలు తెలిపారు.

తమ తండ్రిని హత్య చేసిన వారి పట్ల తనకు ఎలాంటి కోపం లేదని... వారిని క్షమించానని గతంలో రాహుల్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నళిని తన లేఖలో, "నా జీవితంలో ఇప్పటికే ఎన్నో కష్టాలను అనుభవించాను. ఇకపై నా కుమార్తె, తండ్రితో కలసి సంతోషంగా జీవించాలని అనుకుంటున్నా. నా కూతురును ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నా. కేంద్ర ప్రభుత్వం నా పట్ల దయతో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నా" అని చెప్పారు.

మరోవైపు రాజీవ్ హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న ఏడుగురుని గతంలో విడుదల చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వారిని విడుదల చేయవద్దని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో... విడుదల చేయకుండా సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ అంగీకారం లేకుండా ఖైదీలను రాష్ట్రాలు విడుదల చేయడం కుదరదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. రాజీవ్ హత్య కేసులో నిందితులను విడుదల చేస్తే... ప్రమాదకరమైన సంప్రదాయాన్ని ప్రారంభించినట్టు అవుతుందని వ్యాఖ్యానించింది. 

More Telugu News