Narendra Modi: కాంగ్రెస్ బంద్ పిలుపునకు ఆర్జేడీ మద్దతు

  • పెట్రో ధరల పెరుగుదలపై భగ్గుమన్న కాంగ్రెస్
  • ఈ నెల 10న భారత్ బంద్
  • కలిసి వస్తామన్న ఆర్జేడీ

పెట్రో ధరల పెంపునకు నిరసనగా ఈ నెల పదో తేదీన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న బంద్‌కు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) మద్దతు ప్రకటించింది. ఆర్జేడీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర పూర్వే మాట్లాడుతూ వేలాదిమంది పార్టీ కార్యకర్తలు బంద్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు. రోజురోజుకు పెరిగిపోతూ ఆకాశాన్ని అంటుతున్న పెట్రో ధరలకు నిరసనగా కాంగ్రెస్ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మెడలు వంచేందుకు తమతో కలిసి రావాలంటూ కాంగ్రెస్ ఇప్పటికే ఇతర పార్టీలను ఆహ్వానించింది. కాంగ్రెస్ పిలుపునకు స్పందించిన ఆర్జేడీ ఈ బంద్‌లో తమ కార్యకర్తలు, నేతలు వేలాదిగా పాల్గొంటారని తెలిపింది.

గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలను సామాన్యులను షాక్‌కు గురిచేస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే పెట్రోలు ధర లీటర్‌కు 48 పైసలు, డీజిల్‌పై 47 పైసలు పెరిగాయి. ధరలను రోజువారీగా సవరించడం మొదలుపెట్టిన తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.79.99కి చేరుకుని రికార్డు సృష్టించగా, డీజిల్ ధర లీటర్ రూ.72.07గా నమోదైంది. ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ.87.39, డీజిల్ రూ.76.51గా ఉంది. 16 ఆగస్టు నుంచి 31వ తేదీ మధ్య పెట్రోలు లీటర్‌కు రూ.2.85, డీజిల్‌ రూ3.30 పెరిగింది.

More Telugu News