suresh reddy: కేసీఆర్ పిలుపు మేరకే టీఆర్ఎస్ లో చేరుతున్నా!: కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ రెడ్డి

  • 3 తరాలుగా మా కుటుంబం కాంగ్రెస్ లో ఉంది
  • రాష్ట్రాభివృద్ధి ఆగిపోకూడదనే ఈ నిర్ణయం
  • మీడియా సమావేశంలో సురేశ్ రెడ్డి

ప్రజా సంక్షేమం కోసమే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు మాజీ స్పీకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సురేశ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ఆగిపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గత నాలుగేళ్లలో తెలంగాణలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందనీ, అందుకు వేర్వేరు ఆర్థిక సంస్థలు ఇచ్చిన నివేదికలే సాక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు.

పేద ప్రజలకు అండగా ఉండాలన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సురేశ్ రెడ్డి అన్నారు. ఈ నెల 12న కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతానని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తాను కేసీఆర్ తో కలసి పనిచేశానని సురేశ్ రెడ్డి అన్నారు. మూడు తరాలుగా తన కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిందనీ, ఇప్పుడు కేవలం తెలంగాణ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లోకి వెళుతున్నానని ఆయన స్పష్టం చేశారు.  ప్రస్తుతం తెలంగాణలో నిశ్శబ్ద అభివృద్ధి విప్లవం కొనసాగుతోందని ప్రశంసించారు. వేగంగా వెళుతున్న అభివృద్ధి కారు డ్రైవరును ఇప్పుడు మార్చాల్సిన అవసరం లేదనీ, దానివల్ల సామాన్య ప్రజలకు, పేదలకు ఇబ్బంది కలుగుతుందని వ్యాఖ్యానించారు.

105 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నిన్ననే ప్రకటించారనీ, తాను ఆర్మూర్, బాల్కొండ ప్రజల సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు సురేశ్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పటికే బాల్కొండలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డిని టీఆర్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో, రేపు ఒకవేళ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, సురేశ్ రెడ్డికి తొలుత ఎమ్మెల్సీ, ఆ తర్వాత మంత్రి పదవిని కట్టబెట్టే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News