CBI: గుట్కా కుంభకోణం కేసు.. తమిళనాడు మంత్రి, డీజీపీ ఇళ్లపై సీబీఐ దాడులు!

  • తమిళనాడు రాజధాని చెన్నైలో తనిఖీలు
  • మంత్రి విజయ భాస్కర్, డీజీపీ రాజేంద్రన్ ఇళ్లలో సోదాలు
  • గుట్కా అమ్మకాల అనుమతులకు భారీ లంచాలు

గుట్కా కుంభకోణానికి సంబంధించి సీబీఐ అధికారులు ఈ రోజు తమిళనాడులోని చెన్నైలో దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రి విజయ భాస్కర్, డీజీపీ టీకే రాజేంద్రన్, మాజీ కమిషనర్ జార్జ్ నివాసం సహా 40 చోట్ల ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకు ఒక్కసారిగా సీనియర్ అధికారులు, అధికార అన్నాడీఎంకే నేతల ఇళ్లను చుట్టుముట్టిన సీబీఐ, పోలీస్ అధికారులు వారి ఫోన్లను స్వాధీనం చేసుకుని దాడులను ముమ్మరం చేశారు.

గుట్కా తయారీదారుల ఇళ్లపై ఐటీ శాఖ 2016లో నిర్వహించిన దాడుల ద్వారా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిషేధిత గుట్కా అమ్మకానికి వాటి తయారీదారులు మంత్రి విజయ భాస్కర్ తో పాటు డీజీపీ రాజేంద్రన్, మాజీ కమిషనర్ జార్జ్, మరికొంత మంది అధికారులకు రూ.39.91 కోట్లు లంచాల రూపంలో చెల్లించినట్లు తేలింది. వీరు గుట్కా మాఫియా నుంచి నెలకు రూ.53 లక్షల చొప్పున అందుకున్నట్లు కొన్నిపత్రాలు కూడా అప్పట్లో లభ్యమయ్యాయి.

 ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం సరైన తీరులో స్పందించకపోవడంతో డీఎంకే నేతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ గుట్కా కుంభకోణంపై న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆధారాల సేకరణ కోసం సీబీఐ దాడులు నిర్వహించింది.

More Telugu News