Undavalli: ఉండవల్లికి ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవాల్!

  • ‘రాజా ఆఫ్ కరప్షన్’పై బహిరంగ చర్చకు సిద్ధమా?
  • చంద్రబాబుపై ఉండవల్లి హేళనగా మాట్లాడటం తగదు
  • అమరావతి బాండ్ల గురించి ఆయనవి అవాస్తవాలు

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈర్ష్యతో అమరావతి బాండ్ల అమ్మకంపైనా, సీఎం చంద్రబాబునాయుడుపైనా హేళనగా మాట్లాడుతున్నారని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మండిపడ్డారు. 2009లో టీడీపీ ప్రచురించిన ‘రాజా ఆఫ్ కరప్షన్’పై బహిరంగ చర్చకు రావాలని ఉండవల్లికి ఆయన సవాల్ విసిరారు.

సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుటుంబరావు మాట్లాడుతూ, అమరావతి బాండ్లు ట్యాక్స్ ఫ్రీ బాండ్లు కాదని స్పష్టం చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని, వడ్డీ ఎక్కువ ఇస్తున్నామంటున్నారని, అది సరికాదని అన్నారు. సీఆర్డీయే దేశంలో మంచి ఇమేజ్ సంపాదించుకుందని, రూ.2 వేల కోట్ల అమరావతి బాండ్లు ఇష్యూ అయిన తరువాత చాలా మందికి ఈర్ష్య, ద్వేషాలు పెరిగాయని అన్నారు. ఆ కారణంతోనే అమరావతి బాండ్లపైనా, చంద్రబాబుపైనా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

తాము ఇచ్చిన వడ్డీ రేటు కన్నా తక్కువ వడ్డీ రేటుకు ఎవరు తెచ్చినా ఎరేంజ్డ్ ఫీజు ఫ్రీగా ఇస్తామని, తాము రూ.2 లక్షల కోట్లు అప్పు చేశామని ఉండవల్లి ఆరోపిస్తున్నారని, ఉన్న అప్పుల కోసం 75 శాతం వడ్డీలు చెల్లించడం వల్లే అప్పు పెరిగిందని కుటుంబరావు వివరించారు. ప్రజలకు ఆర్థిక అంశాలపై అవగాహన ఉండదన్న ఉద్దేశంతో అబద్ధాలతో ప్రజలను పక్కదోవ పట్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సెబీ కింద గుర్తింపు పొందిన సంస్థలు బిడ్డింగ్ లో కోడ్ చేశాయని, బిడ్డింగ్ పారదర్శకంగా నిర్వహించామని, యూసీలు ఏ విధంగా ఇస్తారో ఎంపీగా పని చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ కు తెలియనిది కాదని అన్నారు. నీతి ఆయోగ్ కూడా తామిచ్చిన యూసీలను ధ్రువీకరించిందని, రాజధాని నిర్మాణానికి కేంద్రమే నిధులు ఇవ్వాల్సి ఉందని, కేంద్రం సహకరించకపోవడంతో, పనులు ఆగకూడదనే ఉద్దేశంతోనే అమరావతి బాండ్లను విక్రయానికి పెట్టామని స్పష్టం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో రాష్ట్రానికి 10 అవార్డులు వచ్చాయని, పారదర్శకతకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏమి కావాలని కుటుంబరావు అన్నారు.

2009లో టీడీపీ ప్రచురించిన ‘రాజా ఆఫ్ కరప్షన్’పై బహిరంగ చర్చకు రావాలని, మీడియా సమక్షంలో చర్చలు జరుపుదామని ఉండవల్లికి సవాల్ విసిరారు. 2004లో స్విట్జర్లాండ్ మంత్రి సీఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు చేశారని ఉండవల్లి చెప్పారని, ఆనాడు చంద్రబాబునాయుడు ‘విజన్ 2020’ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారని చెప్పుకొచ్చారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రూ.లక్షా 9 వేల కోట్లు జి.ఎస్.డి.పి.గా ఉందని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల జి.ఎస్.డి.పి. రూ.13.6 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పారు.

ఆనాడు సీఎం చంద్రబాబునాయుడు ఏడు రెట్లు పెంచుదామని అంటే, నేడు జి.ఎస్.డి.పి. 14 రెట్లు పెరిగిందని, ఇది చంద్రబాబు విజన్ కు నిదర్శనమని, దీన్ని కూడా విమర్శిస్తూ ఉండవల్లి హేళనగా మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. మరో రెండు మూడేళ్లలో సీఆర్డీయే ఆదాయం విపరీతంగా పెరుగుతుందని, ఈ విషయం గుర్తించే ఇన్వెస్టర్లు అమరావతి బాండ్ల కొనుగోలుకు ఆసక్తి చూపారని కుటుంబరావు చెప్పారు.

More Telugu News