shivakrishna: చిన్నప్పుడు దొంగతనానికి వెళ్లాను .. దెయ్యమనుకుని భయపడ్డాను: శివకృష్ణ

  • మా తాతగారి ఊరికి వెళ్లాను 
  • తోటి పిల్లలతో కలిసి దొంగతనానికి వెళ్లాను 
  • భయంతో పరిగెత్తి బురదగుంటలో పడ్డాను

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సీనియర్ నటుడు శివకృష్ణ మాట్లాడుతూ, తన చిన్నతనంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను గురించి ప్రస్తావించారు. "మా తాతగారు వాళ్లది ఆంధ్ర .. నేనేమో హైదరాబాద్ లో పుట్టిపెరిగాను. సంక్రాంతికి భోగిమంటల్లో వేయడానికి అవసరమైన పాత సామాన్లను అక్కడి పిల్లలంతా కలిసి వేరే వాళ్ల ఇళ్లలో దొంగతనం చేస్తారని విన్నాను. అది చూడటం కోసం నేను సంక్రాంతికి మా తాతగారి ఊరు వెళ్లాను.

ఆ రోజు రాత్రి పిల్లలంతా కలిసి ఒక ఇంటికి దొంగతనానికి బయలుదేరారు. దొంగతనం ఎలా చేస్తారో చూడాలనే ఆసక్తితో నన్ను కూడా తీసుకెళ్లమంటే .. 'సరే రా' అన్నారు. వాళ్లతో పాటు నేను కూడా దొంగతనానికి బయలుదేరాను. అందరం కలిసి ఒక ఇంట్లోకి వెళ్లాము .. పాత సామాన్లు ఎక్కడున్నాయా అని వెతుకుతున్నాం. కొన్ని రోజుల క్రితమే ఆ ఇంట్లో ఒకరు చనిపోయారట .. అందువలన ఆ ఇంటి  పెరట్లో ఆరేసిన పంచె గాలికి రెపరెపలాడుతూ ఉండటంతో, అది చూసిన కుర్రాడొకడు 'దెయ్యమేమోరా' అన్నాడు. అంతే.. ఎవరికి వాళ్లు పరిగెత్తేసి ఎటు వీలైతే అటు దూకేశారు. నాకు అలా దూకడం అలవాటు లేదు .. అయినా కంగారులో పరిగెత్తి అక్కడున్న ఒక బురదగుంటలో పడిపోయాను" అని నవ్వేశారు.  

More Telugu News