దు'మా'రం... నరేష్ వి తప్పుడు ఆరోపణలు, ఎన్నికల స్టంటన్న శివాజీ రాజా!

04-09-2018 Tue 08:53
  • సంచలనం రేపుతున్న మరో దుమారం
  • నిధులు దిర్వినియోగం అయ్యాయని ఆరోపణలు
  • ఖండిస్తున్న శివాజీరాజా వర్గం
టాలీవుడ్ లో ఇప్పుడు మరో దుమారం సంచలనం రేపుతోంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో కార్యదర్శి నరేష్, హేమ తదితరులు ఓ వైపు, అధ్యక్షుడు శివాజీ రాజా, నటుడు శ్రీకాంత్ తదితరులు మరోవైపు చేరిపోయారు. అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజా లక్షల రూపాయల నిధులను దుర్వినియోగం చేశాడని ఓ ఆంగ్ల దినపత్రికలో నాలుగు రోజుల క్రితం వచ్చిన వార్తతో కలకలం మొదలైంది. దీని లోతులకు వెళ్లిన నరేష్, దుర్వినియోగం నిజమేనని, తాను నమ్మి సంతకాలు చేశానని, ఇటీవల అమెరికాలో టాలీవుడ్ రజతోత్సవ వేడుకలు జరిగిన వేళ నిధులు దారిమళ్లాయని ఆరోపించగా, దానిపై శివాజీరాజా స్పందించాడు.

'మా'లో ఏం జరిగినా అది అందరికీ తెలిసే జరుగుతుందని, అసోసియేషన్ కు ఎన్నికలు జరిపించి, తాను అధ్యక్షుడిని కావాలన్న ఆశతో నరేష్ ఈ ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. ఆయనవి తప్పుడు ఆరోపణలేనని, ఎన్నికల స్టంటని అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు.