KCR: మీ ఇంటి నుంచి ఒక్కరైనా శ్మశానానికి పోయారా?: కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

  • కేటీఆర్ ఒత్తిడితోనే ‘ముందస్తు’ పాట
  • కేసీఆర్ బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ కట్టుకున్నారు
  • ప్రెస్ మీట్ లో రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిన్న కొంగరకలాన్ లో జరిగింది ప్రగతి నివేదన సభ కాదనీ, పుత్రుడి నివేదిక సభ అని దుయ్యబట్టారు. కేటీఆర్ బెదిరింపులకు లొంగిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలు అంటూ హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ రోజు ఉదయం నిర్వహించిన ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

చుక్కరక్తం చిందించకుండా తెలంగాణ తెచ్చినట్లు కేసీఆర్ చెబుతున్నారనీ, మరి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది సంగతేంటని రేవంత్ ప్రశ్నించారు. ‘నువ్వు(కేసీఆర్) పార్టీ పెట్టిన ఆరేండ్లకు కేటీఆర్ అమెరికా నుంచి వచ్చాడు. ఆ తరువాత కవిత బతుకమ్మ అంటూ దిగింది. ప్రత్యేక తెలంగాణ కోసం 1200 మంది ప్రాణాలు విడిచారు. మరి మీ ఇంట్లో నుంచి ఉద్యమం కోసం ఒక్కరైనా శ్మశానానికి పోయారా?’ అని ఆగ్రహంగా ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారులను కూడా తెలంగాణ ప్రభుత్వం చులకనగా చూస్తోందనీ, దీంతో అధికారులు తిరుగుబావుటా ఎగరవేశారని రేవంత్ అన్నారు.

రూ.1,000 కోట్లతో ప్రగతి భవన్, అందులో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ కట్టుకున్న కేసీఆర్, అమరవీరుల స్థూపం నిర్మించడానికి ఎందుకు ముందుకురావడం లేదని ప్రశ్నించారు. ప్రతీ ఇంటికి ప్రభుత్వం నల్లా కనెక్షన్ ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ సవాల్ విసిరారు.

More Telugu News