polavaram: 'పోలవరం'పై చంద్రబాబు సమీక్ష.. పనుల్లో వేగం తగ్గడంపై అధికారుల వివరణ!

  • గత లక్ష్యాలు అధిగమిస్తూనే కొత్త లక్ష్యాన్ని చేరుకోవాలి
  • ఒక సవాలుగా తీసుకొని పనులు చేపట్టాలి
  • జలవనరుల శాఖలో ఐటీ విభాగం ఏర్పాటు చేయాలి

పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం తగ్గిందని, దీనిని అధిగమించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టు పనుల ప్రగతిపై చంద్రబాబు ఈరోజు సమీక్షించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ, ఈఎన్ సీ ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ‘పోలవరం’ ప్రాంతంలో పనులను లైవ్ ద్వారా చంద్రబాబు సమీక్షించారు.

గత వారంలో 8.66 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు జరిగాయని అధికారులు వివరించారు. స్పిల్ వే పనులు 89 వేల క్యూబిక్ మీటర్లకు గాను 87 వేల క్యూబిక్ మీటర్ల పనులు జరిగినట్టు చంద్రబాబుకు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, గత లక్ష్యాలు అధిగమిస్తూనే కొత్త లక్ష్యాన్ని చేరుకోవడం ఒక సవాలుగా తీసుకొని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా, వర్షాలు, వరద నీటి వల్ల స్పిల్ ఛానల్ పనులు కొంత వేగం తగ్గినా ఈ వారం దాన్ని అధిగమిస్తామని చంద్రబాబుకు అధికారులు వివరించారు.

రిజర్వాయర్ల దగ్గర నిఘా, భద్రతా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి

ఏపీలో రిజర్వాయర్లలో నీటి పరిస్థితి గురించి చంద్రబాబు ప్రస్తావించారు. రిజర్వాయర్ల దగ్గర నిఘా, భద్రతా వ్యవస్థ గట్టిగా ఉండాలని, గేట్ల నిర్వహణ, సాంకేతిక అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. రాయలసీమలో ఇంకా తక్కువ వర్షపాతం ఉందని, రెండు కోట్ల ఎకరాలకు సాగునీరందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ డిమాండ్ ను తీర్చే వ్యూహం అమలు చేయాలని, జలవనరుల శాఖలో ప్రత్యేకంగా ఐటీ విభాగం ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు.

More Telugu News