APSRTC: మహిళా కండక్టర్ కు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేసిన కానిస్టేబుల్!

  • సింహాచలం ఆర్టీసీ డిపోలో ఘటన
  • మీడియాలో వార్తలు రావడంతో తీవ్ర విమర్శలు
  • స్పందించి క్షమాపణ చెప్పించిన ఆర్టీసీ ఎండీ

డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు ఎవరికి నిర్వహిస్తారు? అదేంటి ఆ ప్రశ్న... వాహనం నడిపే డ్రైవర్లకని తెలియదా? అని అడుగుతారా? విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆర్టీసీ డిపోలో ఓ మహిళా కండక్టరుకు కానిస్టేబుల్ డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేసి, ఉన్నతాధికారులతో చీవాట్లు తిన్నాడు. ఓ మహిళకు ఈ పరీక్షలు చేయడంపై ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు సైతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, సదరు కానిస్టేబుల్ తో మహిళా కండక్టరుకు క్షమాపణలు చెప్పించారు. ఇటువంటి ఘటన పునరావృతమైతే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వాస్తవానికి ఆర్టీసీ డిపోల్లో డ్రైవర్లు బస్సును బయటకు తీసే సమయంలో బ్రీత్ అనలైజర్ పరీక్షలు తప్పనిసరి. కండక్టర్లకూ ఈ పరీక్షలు చేయాలని ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆ కానిస్టేబుల్ ఇతర కండక్టర్లతో పాటు ఆమెకూ పరీక్షలు చేశాడు. దీనిపై మీడియాలో వార్తలు, ఫొటోలు వచ్చి విమర్శలు వెల్లువెత్తాయి. ఆపై తాను ఇలా చేసుండాల్సింది కాదని కానిస్టేబుల్ వ్యాఖ్యానించాడు.

More Telugu News