TRS: రెండు లక్షల మంది కూడా రాలేదు... కేసీఆర్ ది కొంగజపమే: పొన్నాల ఎద్దేవా

  • రూ. 300 కోట్లు ఖర్చు చేసి ఓట్ల కోసం గాలం
  • మరోసారి సెంటిమెంట్ ను వాడుకున్న కేసీఆర్
  • ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్న కేసీఆర్
  • పొన్నాల లక్ష్మయ్య విమర్శలు

కొంగరకలాన్ లో రూ. 300 కోట్లు ఖర్చుపెట్టిన కల్వకుంట్ల వారు అక్కడ కొంగజపం చేశారని తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. ప్రగతి నివేదన సభపై స్పందించిన ఆయన, ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ, చేపను పట్టుకోవడానికి కొంగ ఒంటికాలిపై నిలబడి జపం చేస్తున్నట్టు ఉంటుందన్న సంగతి అందరికీ తెలుసునని, అట్లనే కేసీఆర్ కు నాలుగున్నరేళ్ల తరువాత ప్రజలు గుర్తుకొచ్చి, మళ్లీ సెంటిమెంట్ ను వాడుదామని, జనాన్ని ఇంకోసారి మోసం చేద్దామని ఇలా కొంగజపం చేసేందుకు కొంగరకలాన్ ను వాడుకున్నారని విమర్శలు గుప్పించారు.

"ప్రగతి లేదు... ప్రగతి నివేదన కాదు. ప్రగతి మీద మాట్లాడలేదు. ఇచ్చిన హామీలను గురించిన ప్రస్తావన లేదు. ప్రచారం, ఆర్భాటం తప్ప మరోటి కనిపించలేదు. అయ్యా... ఏం మాట్లాడారు అందులో... కరెంట్ గురించి మాట్లాడారు. చాలా సంతోషం. చాలా గొప్పగా చెబుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా... మీ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో అదనంగా ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేశారా? చేయలేదే... దేశమంతా... యూపీఏ కాలంలో వేసిన పునాదుల వల్లే నేడు మిగులు విద్యుత్ ఉంటోంది. అదే రీతిలో రాష్ట్రంలో కూడా సరఫరాకు అవకాశం ఏర్పడింది" అని పొన్నాల అన్నారు.

ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ భయపడదని వ్యాఖ్యానించిన పొన్నాల, ఢిల్లీకి కేసీఆర్ చెంచాగిరీ చేస్తున్నారని, టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు రెండు లక్షలకు మించి జనాలు రాలేదని అన్నారు. ఢిల్లీకి బానిసగా మారింది కేసీఆరేనని, ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

More Telugu News