KTR: 'మంత్రులు, ఎమ్మెల్యేలు మాజీలుగా మారిపోతారా?' అన్న ప్రశ్నకు కేటీఆర్ ఆసక్తికర సమాధానం

  • ప్రగతి నివేదన సభ ఏర్పాట్లలో కేటీఆర్
  • మీడియాతో మాట్లాడిన మంత్రి
  • ఇబ్బందులు పడ్డ ప్రజలకు క్షమాపణలు
ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కొంగరకలాన్ లో ఈరోజు ప్రగతి నివేదన సభను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ దక్కకపోవచ్చని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల గల్లంతుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘నిన్న సాయంత్రానికే సభా ప్రాంగణానికి 4 లక్షల మంది వచ్చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ నుంచి అన్ని వాహనాలు ఇక్కడికే బయలుదేరుతున్నాయి. 4-5 గంటల్లోనే మిగిలిన సభా ప్రాంగణమంతా నిండిపోతుంది. ఈ రోజు మధ్యాహ్నం జరిగే మంత్రిమండలి భేటీకి హాజరుకావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు, మంత్రి మహేందర్ రెడ్డి గారికి మినహాయింపు ఇచ్చారు. సభా ఏర్పాట్లు చూసుకోవాలని మా ఇద్దరిని ఆదేశించారు’ అని కేటీఆర్ తెలిపారు. ఈ సభ కారణంగా ఇబ్బంది పడిన ప్రజలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పారు.

ఈసారి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ లభించకపోవచ్చనీ, ముందస్తు ఎన్నికలకు వెళతారని వస్తున్న ఊహాగానాలపై కూడా కేటీఆర్ మాట్లాడారు. ఈ ప్రగతి నివేదన సభ తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు మాజీలుగా వెళతారన్న అభిప్రాయం ఉంది. దీనిపై మీరేమంటారు? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్వరూ అలా అనుకోవడం లేదు. అందరూ మళ్లీ మేం గెలిచివస్తాం అని పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇక ప్రభుత్వం రద్దు నిర్ణయం అంటారా? నేను, మహేందర్ రెడ్డి గారు కేబినెట్ భేటీకి వెళ్లడం లేదు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు’ అని కేటీఆర్ జవాబిచ్చారు.
KTR
PRAGATI NIVEDANA SABHA
KONGAR KALAN
TRS
Hyderabad
Ranga Reddy District

More Telugu News