Outer Ring Road: ఔటర్ పై ట్రాఫిక్ జామ్... ఎక్కవద్దంటున్న పోలీసులు!

  • ఇప్పటికే కిక్కిరిసిన ఔటర్ రింగ్ రోడ్డు
  • మరో గంటలో రానున్న 30 వేల వాహనాలు
  • ఎయిర్ పోర్టు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచన

వేల సంఖ్యలో వాహనాలు కొంగరకలాన్ లో జరగనున్న ప్రగతి నివేదన సభకు వచ్చేందుకు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పైకి ఎక్కుతూ ఉండటంతో ట్రాఫిక్ కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయింది. దీంతో సామాన్య ప్రయాణికులు ఎవరూ ఈ రోడ్డుపైకి రావద్దని, ముఖ్యంగా విమానాశ్రయానికి వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లోనే వెళ్లాలని సూచిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ తక్కువగా ఉందని తెలిపిన పోలీసులు, అత్యవసర పనులకు నగర రోడ్లనే వాడాలని వెల్లడించారు.

ఇంకో గంట తరువాత సుమారు మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ తదితర జిల్లాల నుంచి వచ్చే సుమారు 30 వేల వాహనాలు ఔటర్ ఎక్కే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించిన పోలీసులు, వీటన్నింటినీ పార్కింగ్ చేయించేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకూ పడుతుందని అంటున్నారు. ఉప్పల్‌, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లాలని భావించే వారు, పాతబస్తీ, ఆరాంఘర్, శంషాబాద్ మార్గంలో వెళ్లాలని, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, మియాపూర్, సికింద్రాబాద్, కూకట్ పల్లి ప్రాంతాల వాసులు, మెహిదీపట్నం, పీవీ ఎక్స్‌ ప్రెస్‌ వే మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు.

More Telugu News