Hyderabad: హైదరాబాద్ గులాబీమయం... దారులన్నీ కొంగరకలాన్ వైపు!

  • సర్వాంగ సుందరంగా ముస్తాబైన హైదరాబాద్
  • 300 మంది కూర్చునేలా సభా వేదిక
  • సాయంత్రం 5.30 గంటలకు చేరుకోనున్న కేసీఆర్
  • సుదీర్ఘంగా సాగనున్న కేసీఆర్ ప్రసంగం

నాలుగున్నరేళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పాలనపై 'ప్రగతి నివేదన సభ'కు హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరంలో ఎటు చూసినా ఈ భారీ బహిరంగ సభ గురించిన సందడే. టీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పటికే నగరాన్ని గులాబీమయం చేశారు. అన్ని ఫ్లయ్ ఓవర్లపై 'ప్రగతి నివేదన సభ'కు ఆహ్వానం పలుకుతూ పోస్టర్లు వెలిశాయి. ఇక ఔటర్ రింగురోడ్డుపై ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న కొంగరకలాన్ వద్ద దాదాపు 1600 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎటుచూసినా రెపరెపలాడే జెండాలు, భారీ కటౌట్లు, నింగికెగిరిన బెలూన్లతో కొంగరకలాన్ పరిసరాలు సందడిగా మారాయి.

 300 మంది కూర్చునేలా సభా వేదిక తయారుకాగా, భారీ వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు. నేటి మధ్యాహ్నం 2 గంటలకల్లా మైదానానికి పార్టీ శ్రేణులు, ప్రజలు చేరుకోనుండగా, 3 గంటల నుంచి సభ ప్రారంభమవుతుంది. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభంకానుండగా, సాయంత్రం 5.30 గంటల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సభా వేదికకు చేరుకోనున్నారు.

ఆయన ప్రసంగం సుదీర్ఘంగా సాగనుండగా, రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమం నుంచి ప్రభుత్వం సాధించిన విజయాల వరకూ వివిధ అంశాలపై ఆయన వివరణ ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదే ప్రసంగంలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీని కూడా ఇస్తారని తెలుస్తోంది. ఇదే సభ వేదికగా, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కొందరు అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ద్వారా సమర శంఖారావాన్ని ఆయన పూరిస్తారని సమాచారం.

More Telugu News