Andhra Pradesh: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు.. భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఉరివేసుకున్న నవ వధువు!

  • వివాహ సమయంలో రూ.2 లక్షల కట్నం.. బంగారం, కిలో వెండి ఇచ్చినా వేధింపులు
  • రూ. 10 లక్షల అదనపు కట్నం కావాలంటూ వేధింపులు
  • భార్యను వదిలేసి పారిస్ వెళ్లిపోయిన భర్త, కుటుంబ సభ్యులు

భర్తతో వీడియో కాల్ మాట్లాడుతూ భార్య ఉరివేసుకున్న విషాద ఘటన ఇది. అదనపు కట్నం కోసం భర్త తరచూ వేధిస్తుండడంతో భరించలేని ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది. అతడితో మాట్లాడుతూనే ఉరివేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన రావూరి అరుణాదేవికి(24) యానాంకు చెందిన కామిశెట్టి వెంకటపెరుమాళ్లుతో ఈ ఏడాది మే 5న వివాహమైంది.

కట్నకానుల కింద వరుడికి 15 కాసుల బంగారం, కిలో వెండి, రూ.2 లక్షలు ముట్టచెప్పారు. నెల రోజులు కాపురం చేసిన అనంతరం అరుణను ఆమె తల్లిదండ్రుల ఇంటి వద్ద వదిలేసి పెరుమాళ్లు కుటుంబం పారిస్ వెళ్లిపోయింది. అయితే, రోజులు గడుస్తున్నా తనను తీసుకెళ్లేందుకు రాకపోవడంతో తనను తీసుకెళ్లాలని భర్తను కోరింది. అయితే, తనకో 20 సెంట్ల భూమి, రూ.10 లక్షలు ఇస్తేనే తీసుకెళ్తానని చెప్పడంతో ఆమె హతాశురాలైంది.

 అల్లుడి కోర్కెలతో నిర్ఘాంతపోయిన అరుణ తండ్రి సంక్రాంతి నాటికి అన్నీ సమకూరుస్తానని మాటిచ్చాడు. అయినా వినకుండా అరుణను ఫోన్ చేసి వేధిస్తూనే ఉన్నాడు. బుధవారం మరోమారు ఫోన్ చేసిన పెరుమాళ్లు అదనపు కట్నం కోసం మరోమారు నిలదీశాడు. దీంతో విసిగిపోయిన అరుణ అతడితో వీడియోకాల్ మాట్లాడుతూనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  

వీడియో కాల్‌లో అరుణ ఉరివేసుకోవడాన్ని చూసిన పెరుమాళ్లు తల్లి చిన్న అమ్మాజీ వెంటనే ఊళ్లోని సోదరి సాయిసుమకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆమె వచ్చి చూసే సరికి అరుణ ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కిందికి దింపి కుటుంబ సభ్యుల సాయంతో అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడామె చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News