hari krishna: రాష్ట్ర విభజన సమయంలో హరికృష్ణ ఎంతో ఆవేదనకు గురయ్యారు: వెంకయ్యనాయుడు

  • తండ్రికి తగ్గ తనయుడు హరికృష్ణ
  • ఏ పనైనా ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధితో చేసేవారు
  • హరి మన మధ్య లేకపోవడం బాధాకరం

దివంగత హరికృష్ణకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఘన నివాళి అర్పించారు. మెహిదీపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లిన వెంకయ్య... హరికృష్ణ పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తండ్రికి తగిన తనయుడు హరి అని కొనియాడారు. ముక్కుసూటితనం ఆయనకు ఆభరణమని చెప్పారు. ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో, చిత్తశుద్ధితో చేసేవారని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందడం విచారకరమని చెప్పారు.

ఎదుటివారు ఏమనుకుంటారో అనే భావన హరికి ఉండేది కాదని, తాను చెప్పదలుచుకున్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేవారని వెంకయ్య చెప్పారు. రాజ్యసభలో తాను తెలుగులోనే మాట్లాడతానని హరి పట్టుబట్టారని... అప్పటి నిబంధనల ప్రకారం తెలుగులో మాట్లాడటం కుదరదని సభాపతి చెప్పారని... తాను జోక్యం చేసుకుని, 'మాతృభాషలో మాట్లాడాలనుకుంటున్నారు, అవకాశం ఇవ్వండి. మీకు అర్థం కాకుంటే  నేను తర్జుమా చేస్తా' అని చెప్పానని తెలిపారు.

రాష్ట్ర విభజన సమయంలో సమయంలో కూడా... 'అన్నా, చాలా అన్యాయం జరుగుతోంది, మీరు చాలా పోరాడుతున్నారని నాకు తెలుసు. నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఏం చేయమంటారు నన్ను?' అంటూ తనతో ఆవేదన వ్యక్తం చేశారని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో, సినీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారని చెప్పారు.

తన నడవడిక కారణంగానే ప్రజల్లో ఆయన ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. తెలుగుజాతి ఆత్మాభిమానాన్ని నలు దిశలా చాటిన ఎన్టీఆర్ కు తగిన వారసుడు హరి అని చెప్పారు. హరి మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని అన్నారు. నందమూరి కుటుంబసభ్యులను ఓదార్చేందుకు తాను వచ్చానని.. కుటుంబసభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని వేడుకుంటున్నానని చెప్పారు. 

More Telugu News