Tripura: ప్రేమికురాలితో రాఖీ కట్టించేందుకు యత్నించిన స్కూల్.. బిల్డింగ్ పై నుంచి దూకిన ప్రియుడు!

  • త్రిపుర రాజధాని అగర్తలాలో ఘటన
  • ప్రియుడికి రాఖీ కట్టాలన్న స్కూల్ యాజమాన్యం
  • విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
ఓ స్కూలు యాజమాన్యం చేసిన పనికి యువకుడు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రియురాలితో రాఖీ కట్టించడానికి స్కూల్ యాజమాన్యం యత్నించడంతో తట్టుకోలేని ఓ యువకుడు బిల్డింగ్ పై నుంచి దూకేశాడు. త్రిపుర రాజధాని అగర్తలాలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అగర్తలాలోని ఓ స్కూల్ లో చదువుతున్న దిలీప్ కుమార్ అనే యువకుడు, మరో యువతి ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం ఇద్దరి తల్లిదండ్రులను పిలిపించింది. పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్లు వారిముందే యువతి చేత యువకుడికి రాఖీ కట్టించేందుకు యత్నించారు. కానీ దీనికి యువతీయువకులు నిరాకరించారు. అయినా పాఠశాల యాజమాన్యం ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెందిన యువకుడు రెండో అంతస్తు పైకివెళ్లి కిందకు దూకేశాడు.

ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం తీరును నిరసిస్తూ యువతీయువకుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tripura
agartala
love
rakhi
boy suicide
teachers
force
school management

More Telugu News