Andhra Pradesh: మత ప్రచారం వార్తల్లో నిజం లేదు: నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ వెంకటదాస్

  • ట్రిపుల్ ఐటీలో ప్రతీ ఆదివారం ప్రార్థనలు జరుగుతున్నట్టు వార్తలు
  • తల్లిదండ్రుల రూపంలో క్యాంపస్‌లోకి మతబోధకులు
  • ఆ వార్తలు మీడియా సృష్టేనన్న వెంకటదాస్

నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో మత ప్రచారం జరుగుతోందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని డైరెక్టర్ వెంకటదాస్ కొట్టిపడేశారు. ట్రిపుల్ ఐటీకే చెందిన ఓ ఉన్నతాధికారి భార్య అండదండలతో ప్రతీ ఆదివారం క్యాంపస్‌లో మత ప్రార్థనలు, ప్రచారం నిర్వహిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అమ్మాయిలు, అబ్బాయిలతో వేర్వేరుగా ప్రార్థనలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

విద్యార్థుల తల్లిదండ్రుల పేరుతో ప్రతీ ఆదివారం కొందరు మతబోధకులు క్యాంపస్‌లోకి వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారన్న వార్తలు వెలుగు చూడడంతో కలకలం రేగింది. దీంతో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు వైస్ చాన్స్‌లర్ ఓ కమిటీని నియమించారు. కమిటీ విచారణ సందర్భంగా క్యాంపస్‌లో ప్రతీ ఆదివారం మత ప్రార్థనలు జరగడం వాస్తవమేనని తేలింది. విచారణ కమిటీ ఎదుట విద్యార్థులు ఈ విషయాన్ని వెల్లడించారు. బయటి నుంచి పాస్టర్లు వచ్చి క్యాంపస్‌లో ఆదివారం మత ప్రార్థనలు నిర్వహించేవారని విద్యార్థులు తెలిపారు.  విద్యార్థులను విచారించిన కమిటీ నివేదికను సిద్ధం చేసింది.

అయితే, తాజాగా ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ వెంకటదాస్ మాట్లాడుతూ మత ప్రార్థనలు జరుగుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. క్యాంపస్‌లో ఎటువంటి మత ప్రచారం జరగడం లేదని, తాము ప్రతీరోజు తరగతి గదులను పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మీడియా సంస్థలు కొన్ని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని వెంకటదాస్ ఆరోపించారు.

More Telugu News