Pawan Kalyan: తమ్మినేని రాసిన లేఖపై ‘ప్యాక్’ లో చర్చించాం: ‘జనసేన’

  • సీపీఎం నేతలతో ముఖాముఖి చర్చకు నిర్ణయించాం
  • ఆ పార్టీ నేతలను జనసేన కార్యాలయానికి ఆహ్వానిస్తాం
  • ఓ ప్రకటనలో ‘జనసేన’

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీతో కలసి పని చేయాలన్న అభిలాషను వ్యక్తం చేస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్) లో చర్చించాల్సిందిగా పవన్ కళ్యాణ్ చేసిన సూచన మేరకు ఈ రోజు హైదరాబాదులో ప్యాక్ సమావేశమైంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

జనసేన పార్టీలోని తెలంగాణ నేతలతో కలసి ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించినట్టు పేర్కొంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ లేఖ రావడంతో సీపీఎం నేతలతో ముఖాముఖి చర్చించాలని ప్యాక్ నిర్ణయించినట్టు పేర్కొంది.

‘జనసేన’తో కలసి పని చేయడం ప్రజా సమస్యల పరిష్కారంలోనా? లేక వచ్చే ఎన్నికలలో కలసి పోటీ చేయడానికా? అన్న విషయాలపై స్పష్టత అవసరమని ప్యాక్ అభిప్రాయపడినట్టు స్పష్టం చేసింది. సీపీఎం నేతలను ‘జనసేన’ పార్టీ కార్యాలయానికి ఆహ్వానించాలని ప్యాక్ నిర్ణయించిందని, సీపీఎం నేతలతో సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడికి ఒక నివేదికను సమర్పిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. 

More Telugu News