assam: మహిమల పేరుతో మహిళలపై ముద్దుల వర్షం.. దొంగ బాబాను కటకటాల వెనక్కి నెట్టిన అసోం పోలీసులు!

  • అసోంలోని మోరిగావ్ లో ఘటన
  • మహిళలను బురిడీ కొట్టిస్తున్న ప్రకాశ్
  • ముద్దులతో రోగాలన్నీ తగ్గిస్తానని హామీ

అమాయక మహిళలు లక్ష్యంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ బాబాను అసోం రాష్ట్ర పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. రాష్ట్రంలోని మోరిగావ్ జిల్లా భోరాల్ తుప్ గ్రామంలో ఉంటున్న రామ్ ప్రకాశ్ చౌహాన్ ఖాళీగా ఉండేవాడు. నెలరోజుల క్రితం బాబాగా వేషం వేయాలని నిర్ణయించుకున్నాడు.

మహిళలకు ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా తాను పరిష్కరిస్తానని ప్రకాశ్ చెప్పుకునేవాడు. తనకు విష్ణుమూర్తి ఈ శక్తి ఇచ్చాడని కలరింగ్ ఇచ్చేవాడు. రోగాలు తగ్గాలంటే తనను కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలని చెప్పేవాడు. ఈ ప్రబుద్ధుడు చేసే నిర్వాకానికి అతడి తల్లి కూడా మద్దతు పలికింది. తన కుమారుడికి నిజంగానే మహిమలు ఉన్నాయని చుట్టుపక్కల ప్రచారం చేయడం ప్రారంభించింది.

ఈ తతంగం నడిపేందుకు ప్రకాశ్ ఇంటి ప్రాంగణంలోనే సొంతంగా ఓ గుడిని సైతం నిర్మించాడు. శారీరక, మానసిక అంశాలే కాకుండా మహిళల వివాహ సంబంధ సమస్యలను కూడా పరిష్కరిస్తానని ప్రకాశ్ చెప్పుకున్నాడు. తాను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటే ఎలాంటి రోగాలైనా పరార్ అయిపోతాయని చదువుకోని ఆ అమాయక మహిళలను నమ్మించేవాడు.

ఈ నెల 22న ఈ కిస్సింగ్ బాబా గురించి తెలుసుకున్న పోలీసులు విచారణ జరిపి నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. అసోంలోని మోరిగావ్ జిల్లా ప్రాంతంలో అక్షరాస్యత చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ప్రజలు మూఢనమ్మకాలతో ఇలాంటి దొంగ బాబాలను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు.

More Telugu News