Kerala floods: కేరళ వరదలు దేశ విభజన నాటి పరిస్థితులలా ఘోరంగా వున్నాయి: ఆస్కార్ అవార్డు గ్రహీత రేసుల్

  • కేరళ వరదలు దేశ విభజన నాటి పరిస్థితులకు ఏమాత్రం తీసిపోవు 
  • బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన బాలీవుడ్‌కు కృతజ్ఞతలు
  • స్పిరిట్ ఆఫ్ ఇండియాకు ఇది నిదర్శనం

కేరళ వరదలు 1947 నాటి దేశ విభజన నాడు తలెత్తిన పరిస్థితులలా ఘోరంగా వున్నాయని ఆస్కార్ అవార్డు గ్రహీత, సౌండ్ ఇంజినీర్ రేసుల్ పూకుట్టీ అభివర్ణించారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన బాలీవుడ్ ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, విద్యాబాలన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్, సోనమ్ కపూర్, అలియా భట్, విధు వినోద్ చోప్రా తదితరులతో తాను మాట్లాడానని, కేరళను ఆదుకునేందుకు వారందరూ ముందుకొచ్చారని రేసుల్ పేర్కొన్నారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, దీపిక పదుకునే, అక్షయ్ కుమార్ ఇప్పటికే కేరళకు సాయం పంపించినట్టు చెప్పారు. అమితాబ్ బచ్చన్ దుస్తులు, ఆహార పదార్థాలను పంపించారని, అలియా భట్ కూడా ఆహారం, దుస్తులు ప్యాక్ చేసి పంపించారని వివరించారు. ఇది స్పిరిట్ ఆఫ్ ఇండియాకు నిదర్శనమని కొనియాడారు.

కేరళ ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతోందని రేసుల్ పేర్కొన్నారు. బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారని, కానీ మానవ, జంతువుల మృతదేహాలు వారికి ఆహ్వానం పలుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో ప్రజలు విలువైన పత్రాలను కోల్పోయారని, దేశ విభజన సమయంలోనూ ఇలాగే జరిగిందన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ కొందరు వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు వాటన్నింటికీ దూరంగా ఉండాలని, ఐకమత్యాన్ని చాటాలని రేసుల్ పిలుపునిచ్చారు.

More Telugu News