New Delhi: కేంద్రంపై నిప్పులు చెరిగిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ప్రధాని పేరు మారిస్తే ఓట్లు పడతాయని ఎద్దేవా!

  • రామ్‌లీలా మైదానానికి వాజ్‌పేయి పేరు
  • ప్రధాని పేరునే మార్చాలన్న కేజ్రీవాల్
  • ఆ వార్తల్లో నిజం లేదన్న బీజేపీ

కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు నిప్పులు చెరిగారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానానికి దివంగత మాజీ ప్రధాని పేరు పెట్టాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై ఆయన మండిపడ్డారు. మైదానం పేరు మార్చడానికి బదులు ప్రధాని పేరునే మార్చేస్తే వచ్చే ఎన్నికల్లో ఓట్లైనా పడతాయని ఎద్దేవా చేశారు. రామ్‌లీలా మైదానానికి వాజ్‌పేయి పేరు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మైదానానికి పేరు మారిస్తే ఓట్లు రాలవని, ప్రధానమంత్రి పేరునే మార్చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందని ఎద్దేవా చేశారు. మోదీ పేరు చూసి జనాలు ఓట్లు వేయడానికి వెనకాడుతున్నారని అన్నారు. కాగా, రామ్‌లీలా మైదానం పేరు మార్చబోతున్నారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ ఢిల్లీ చీఫ్ స్పందించారు. అటువంటి ఆలోచన ఏదీ లేదని తేల్చి చెప్పారు. ఉత్తర ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ మేయర్‌ ఆదేశ్‌ కుమార్‌ గుప్తా కూడా ఈ వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. వివాదాలు సృష్టించేందుకు కొందరు కావాలనే ఇటువంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

More Telugu News