Telangana: సెప్టెంబరు 6న ఏకాదశి నాడు తెలంగాణ శాసనసభ రద్దు.. ముహూర్తం ఖరారు?

  • గ్రహబలాన్ని విశ్వసించే కేసీఆర్
  • సెప్టెంబరు 6న దివ్యమైన ముహూర్తం
  • నిన్నటి సమావేశంలో చూచాయగా చెప్పిన సీఎం

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సై అన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రభుత్వ రద్దుకు ముహూర్తం కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. పంచాంగాన్ని, గ్రహబలాన్ని విశ్వసించే కేసీఆర్ వచ్చే నెల 6న ఏకాదశి రోజున శాసనసభను రద్దు చేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కేసీఆర్ జాతకరీత్యా కూడా ఇదే మంచి ముహూర్తమని, అన్నీ పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

శుక్రవారం టీఆర్ఎస్ భవన్‌లో నిర్వహించిన  పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, రాష్ట్ర కమిటీ సంయుక్త సమావేశంలో కేసీఆర్ ముందస్తు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మరో 10-12 రోజుల్లో కలుద్దామని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యల ప్రకారం.. శుక్రవారం నుంచి 12 రోజులు అంటే సెప్టెంబరు 4. ఆ తర్వాతి రోజు ఐదో తారీఖు. ఆ రోజు ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంది. కేసీఆర్ జన్మ నక్షత్రమైన ఆశ్లేషకు ఇది నైధనతార. కాబట్టి ప్రభుత్వ రద్దుకు అది పనికిరాదు.

ఇక ఆరో తేదీన ఏకాదశి. గురువారం, పునర్వసు నక్షత్రం.. మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకు ఉంది. ఆ తర్వాత పుష్యమీ నక్షత్రం వస్తుంది. కేసీఆర్‌కు ఇది మిత్ర తార. కాబట్టి అన్నీ అనుకూలంగా ఉండడం, ముహూర్తం దివ్యంగా ఉండడంతో ఆ రోజే శాసనసభను రద్దు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. పండితుల సూచనలతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News