Supreme Court: ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల పిల్లల రిజర్వేషన్ల కోటాపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

          

  • 2006 నాటి కేసు తీర్పుపై సమీక్ష పిటిషన్ విచారణ
  • ఉన్నతోద్యోగుల పిల్లలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లా?
  • క్రీమీ లేయర్ ఎందుకు వర్తింపజేయరు?  
  • కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్నలు  

ప్రభుత్వంలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉన్నతోద్యోగుల పిల్లలకు ఉద్యోగాల పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీరికి పదోన్నతులలో రిజర్వేషన్లు ఎలా వర్తింపజేస్తారని సుప్రీం ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ తరహా రిజర్వేషన్లు ఆగిపోవడానికి కారణమైన 2006 నాటి ఓ కేసు తీర్పును సమీక్షించాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.

నిన్నల్లా జరిగిన విచారణలో అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్, అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, ఇంకా పలువురు సీనియర్‌ లాయర్లు ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్లను సమర్థిస్తూ వాదించారు. అయితే, ప్రముఖ న్యాయవాది శాంతిభూషణ్, మరో న్యాయవాది రాజీవ్ ధావన్ లు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వాదించారు. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ వల్ల మిగతా సామాజిక వర్గాలవారు నష్టపోతున్నారని చెబుతూ, ఈ కోటాను వ్యతిరేకించారు.

 'ఒక వ్యక్తి క్లాస్ వన్ అధికారి అయినప్పుడు ఇక అతని కుటుంబం ఎంత మాత్రం వెనుకబడి ఉండదు. కానీ, రాజకీయ పార్టీలు మాత్రం దళితులను ఓటు బ్యాంకుగానే ఇప్పటికీ చూస్తున్నాయి' అంటూ శాంతిభూషణ్ తన వాదన వినిపించారు. ఈ సందర్భంగా కోర్టు కల్పించుకుని, క్రీమీ లేయర్ (సంపన్న శ్రేణి) పద్ధతిని ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు వర్తింపజేయరు? అంటూ కేంద్రాన్ని నిలదీసింది.

ఇదే సందర్భంలో సుప్రీం ఓ ఉదాహరణ కూడా చెప్పింది. "ఒక వ్యక్తి ప్రమోషన్లలో రిజర్వేషన్ల కారణంగా ఒక రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ అయ్యాడనుకుందాం. అప్పుడు కూడా అతని కుటుంబ సభ్యులను దళితులుగానే భావించి వారికీ పదోన్నతుల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం సహేతుకమైన చర్యేనా?" అంటూ కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.   

More Telugu News