fake medicine: ప్రాణాలతో నకిలీ మందుల మాఫియా చెలగాటం

  • నాలుగు నెలల క్రితమే బాగోతం వెలుగులోకి
  • అయినా సీరియస్‌గా తీసుకోని రాష్ట్ర అధికారులు
  • తాజాగా 18 రకాల మందులు వెనక్కి పంపాలని ఆదేశం

ఏపీలో నకిలీ మందుల తయారీ మాఫియా దందా ఏ స్థాయిలో ఉందో రాజస్థాన్‌ అధికారులు మరోసారి బట్టబయలు చేశారు. మార్కెట్‌లోకి మందులు డంప్‌చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వీరి తీరును నాలుగు నెలల క్రితమే రాజస్థాన్‌ అధికారులు బయటపెట్టారు. అప్పట్లో హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత ఆ సంగతే మర్చిపోయారు. గుంటూరు కొత్తపేట కేంద్రంగా దుర్గా మెడికల్‌ ఏజెన్సీస్‌ సంస్థ ఆల్ట్రాసెట్‌ మెడిసిన్‌కు నకిలీలు తయారుచేసి కోట్లు దండుకున్న విషయం తెలిసిందే.

 తాజాగా మరో 18 రకాల నకిలీ మందులు మార్కెట్లో చలామణి అవుతున్నాయని గత నెల 16న రాజస్థాన్‌ అధికారులు గుర్తించి రాష్ట్ర అధికారులకు సమాచారం ఇవ్వడం సంచలనమైంది. ఈ మందులను హోల్‌సేల్‌, రిటైల్‌ షాపుల్లో గుర్తించి వినియోగదారులకు అందకుండా వెనక్కి పంపాలని కోరారు. అయితే ఇప్పటికే రూ.10 కోట్ల విలువైన 80 శాతం మందుల అమ్మకాలు జరిగిపోయినట్లు బయటపడింది. ఈ విషయమై అధికారులు  మాత్రం నోరు మెదపడం లేదు. ఇటీవల కాలంలో గుంటూరు మందుల మార్కెట్‌లో తీవ్ర పోటీ నెలకొనడంతో తయారీదారులే రిటైల్‌ దుకాణాలు తెరిచి వ్యాపారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని సమాచారం. 

  • Loading...

More Telugu News