Paytm: కేరళకు వ్యాపార దిగ్గజాల ఆపన్న హస్తం.. పలు రకాలుగా సాయం!

  • రూ.30 కోట్ల విరాళాలు సేకరించి అందించిన పేటీఎం
  • ‘మెర్సీ కార్ప్స్’ అనే స్వచ్ఛంద సంస్థ కోసం విరాళాలు సేకరిస్తున్న యాపిల్ 
  • రూ.3.5 కోట్లను అందించిన శాంసంగ్

గత వందేళ్ళలో ఎన్నడూ లేని విధంగా కేరళను వర్షాలు, వరదలు ముంచెత్తి లక్షలాదిమంది ప్రజలకు నిలువ నీడ లేకుండా చేశాయి. అలాంటి స్థితిలో ఉన్న కేరళకు అండగా నిలవటానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు, సినీ ప్రముఖులు, వ్యాపార సంస్థలు ముందుకు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యాపార సంస్థలు సాయం అందించటంలో పోటీ పడుతున్నాయి. కోట్ల రూపాయల విరాళాలను ప్రకటించి  తమ ఉదారతను చాటుతున్నాయి. 

కేరళ వరద బాధితుల కోసం పేటీఎం తమ 12 లక్షలమంది  ఖాతాదారుల నుంచి రూ.30 కోట్ల విరాళాలు సేకరించి కేరళకు అందించింది. యాపిల్ , శాంసంగ్ వంటి మొబైల్ కంపెనీ దిగ్గజాలు పోటీ పడి మరీ సహాయం అందిస్తున్నాయి. యాపిల్ సంస్థ యాప్ స్టోర్, ఐట్యూన్స్ స్టోర్ ద్వారా ‘మెర్సీ కార్ప్స్’ అనే స్వచ్ఛంద సంస్థ కోసం విరాళాలు సేకరిస్తోంది. వినియోగదారులు రూ.250 నుంచి రూ.7,500 వరకు తమ విరాళాలను ఇవ్వవచ్చు.

ఇక శాంసంగ్ సహాయ చర్యల కోసం రూ.2 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.1.5 కోట్లు ఇచ్చింది. అలాగే సంస్థ ఉద్యోగులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రిలీఫ్ క్యాంపుల్లో శాంసంగ్ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చెయ్యటంతో పాటు ఉచిత వాయిస్, వీడియో కాల్ సౌకర్యం కల్పిస్తున్నారు. పునరావాస శిబిరాల్లో శాంసంగ్ రిఫ్రిజిరేటర్లు, ఓవెన్లు పెట్టింది. ఇక ఐడియా తన కస్టమర్లకు ఉచితంగా సిమ్ కార్డులను రీప్లేస్ చేస్తోంది. ఇలా  ప్రముఖ వ్యాపార సంస్థలు కేరళ వరద బాధితులకు సహాయం అందిస్తున్నాయి. 

More Telugu News