postal stamps: ఏపీ ప‌ర్యాట‌క శాఖ ప్రాంతాలపై తపాలా బిళ్లలు!

  • త‌పాలా బిళ్ల‌ల‌పై రాష్ట్ర ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌లు
  • జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌చారానికి దోహ‌దం 
  • ప‌ర్యాట‌క‌, భాషా, సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి మీనా 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క రంగ ప్రాధాన్య‌త‌లు పోస్ట‌ల్ స్టాంప్ (త‌పాలా బిళ్ల‌) రూపంలో విశ్వ‌వ్యాప్తం కానున్నాయి. త‌పాలా శాఖ అందిస్తున్న ‘మై స్టాంప్’ పథకాన్ని   స‌ద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర‌ ప‌ర్యాట‌క, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. రాష్ట్రంలోని 12 ప‌ర్యాట‌క ప్రాంతాల‌పై ప్ర‌త్యేక త‌పాలా బిళ్ల‌ల‌ను విడుద‌ల చేయించ‌టం ద్వారా అటు ప్ర‌త్య‌క్షంగానూ, ఇటు ప‌రోక్షంగానూ ప‌ర్యాట‌క ప్రాంతాలు మ‌రింత‌గా జ‌న బాహుళ్యంలోకి వెళ్లేలా కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేసింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు రేపు వీటిని ఆవిష్క‌రించ‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో ప‌ర్యాట‌క‌, భాషా సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌ఖ్యాతి గాంచిన ప‌ర్యాట‌క ప్రాంతాలు ఇక‌ త‌పాలా బిళ్ల‌ల‌పై క‌నువిందు చేయ‌నున్నాయ‌ని, ప్ర‌పంచంలోనే రెండో అతిపెద్ద దేవాల‌య ప‌ర్యాట‌క ప్రాంతంగా ఉన్న తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మొద‌లు, శ్రీ‌శైలం భ్ర‌మ‌రాంబ స‌మేత మ‌ల్లికార్జున స్వామి వారి దేవ‌స్థానం, విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ‌వారి గుడి, అర‌కు గిరిజ‌న ప్ర‌ద‌ర్శ‌నశాల‌, క‌డ‌ప - గండికోట రాతిలోయ‌, విశాఖ‌ప‌ట్నం - రామ‌కృష్ణ బీచ్‌, చిత్తూరు - చంద్ర‌గిరి కోట‌, అమ‌రావ‌తి - ప‌విత్ర‌ సంగ‌మం (ఇబ్ర‌హింప‌ట్నం), రాజ‌మండ్రి - పాపికొండ‌లు, అర‌కు -బొర్రా గుహ‌లు, నెల్లూరు - పులికాట్ స‌ర‌స్సు, అమ‌రావ‌తి - జ్ఞాన‌బుద్ధుడు.. ఇలా 12 ప్రాంతాల చిత్రాల‌తో త‌పాళా బిళ్ల‌లు సిద్ధం చేసినట్టు తెలిపారు.

ఈ త‌పాలా బిళ్ల‌ల‌ను ప‌ర్యాట‌క శాఖ ప్ర‌త్యేక అవ‌స‌రాల కోసం వినియోగిస్తుంద‌ని, రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌ల‌కు వ‌చ్చే వివిధ దేశాల ప్ర‌తినిధులు, ప్రముఖుల‌కు వీటిని బ‌హుమ‌తిగా అందజేస్తామని మీనా తెలిపారు. త‌ద్వారా అంత‌ర్జాతీయ స్థాయిలో ఏపీ ప‌ర్యాట‌క ప్రాంతాలు ప్ర‌త్యేక ప్ర‌చారం పొంద‌గ‌లుగుతాయ‌ని అన్నారు.
మ‌రోవైపు వివిధ దేశాల‌లో జ‌రిగే అంత‌ర్జాతీయ స్థాయి ప‌ర్యాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌ల‌లో వీటిని అందుబాటులో ఉంచ‌టం ద్వారా  ప‌ర్యాట‌క చిత్రాల‌తో కూడిన త‌పాలా బిళ్ల‌లపై ఆయా స‌ద‌స్సుల‌లో చ‌ర్చ‌కు అవ‌కాశం క‌లుగుతుంద‌ని, ఇది మ‌రింత‌గా విదేశీ, స్వ‌దేశీ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేందుకు ఉప‌యోగ‌ ప‌డుతుంద‌ని మీనా వివ‌రించారు.

ఈ తపాలా బిళ్ల‌ల‌కు అనుసంధానంగా ఆంధ్ర‌ప‌దేశ్ ప్ర‌భుత్వ రాజ‌ముద్ర‌, ప‌ర్యాట‌క శాఖ లోగో కూడా ఉంటాయ‌ని, ఇది చూప‌రుల ఆస‌క్తిని రాష్ట్రం వైపునకు మ‌ర‌ల్చ‌గ‌లుగుతుంద‌ని, దీనికి సంబంధించి ఇప్ప‌టికే అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేయ‌టం జ‌రిగింద‌ని వివరించారు. స్టాంపుల సేక‌ర‌ణ ప్రేమికులు వీటిని అపురూపంగా భ‌ద్ర‌ప‌రుచుకుంటార‌ని, వారి ప్ర‌ద‌ర్శ‌న‌ల‌లో స‌హ‌జంగానే ఇవి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని మీనా పేర్కొన్నారు.

More Telugu News