Nellore District: రూ.50 లక్షలు ఖర్చుపెట్టినా పదవి ఇవ్వరా?: అమరావతిలో నెల్లూరు కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం!

  • ఆత్మహత్యకు యత్నించిన శివాచారి
  • పనబాక లక్ష్మి అడ్డుకుంటున్నారని ఆవేదన
  • నెల్లూరు రూరల్ ఇన్ చార్జ్ గా నియమించాలని డిమాండ్

నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ఈ రోజు అమరావతిలో జరిగిన పార్టీ సమావేశంలో హల్ చల్ చేశారు. పార్టీ కోసం పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడినా తనకు గుర్తింపు దక్కలేదన్న ఆవేదనతో పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. దీంతో అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు కొందరు ఆయన్ను అడ్డుకున్నారు.

నెల్లూరుకు చెందిన శివాచారి గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఇన్ చార్జ్ భాధ్యతలు ఇవ్వాలని రాష్ట్రస్థాయి నేతలను ఆయన కోరాడు. అయితే అది దక్కకపోవడంతో ఆవేదనతో ఈ రోజు పార్టీ సమావేశంలో ఆత్మహత్యకు యత్నించాడు. ఈ నేపథ్యంలో శివాచారి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం జిల్లాలో తాను అహర్నిశలు కష్టపడ్డానని తెలిపారు. నెల్లూరు రూరల్ లో పార్టీని బతికించుకోవడం కోసం రూ.50 లక్షలు ఖర్చు పెట్టానని చెప్పుకొచ్చారు.

మాజీ మంత్రి పనబాక లక్ష్మి పార్టీలో తన ఎదుగుదలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆమె మద్దతుదారులు తనపై తప్పుడు రిపోర్టులను రాష్ట్ర స్థాయి నేతలకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను నెల్లూరు రూరల్ ఇన్ చార్జ్ గా నియమించకపోతే జిల్లా పార్టీ కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.

More Telugu News