KCR: లాభాల్లో వాటా పెంపు ... సింగరేణి ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం!

  • ఈ ఆర్థిక సంవత్సరం 27శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని ఆదేశించిన సీఎం 
  • ఎనిమిదేళ్ళ పెండింగ్ పీఆర్సీని చెల్లించాలని నిర్ణయం 
  • సింగరేణి ఉద్యోగుల గృహ నిర్మాణానికి 10లక్షల వరకు వడ్డీ లేని రుణాలు 

సింగరేణి ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. లాభాల్లో ఉద్యోగుల వాటాను గత ఆర్థిక సంవత్సరంకంటే ఈ ఏడాది 2 శాతం పెంచారు. సింగరేణి ఉద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి వుందని, ఉద్యోగులకు చెల్లించాల్సిన ఎనిమిదేళ్ల పీఆర్సీ బకాయిలను చెల్లించాలని సింగరేణి సీఎండీని ముఖ్యమంత్రి ఆదేశించారు.

  నిజామాబాద్ ఎంపీ కవిత ఆధ్వర్యంలో కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్, టీబీజీకేఎస్ నాయకులు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. గతంలో సింగరేణి ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ పనితీరుపై ఆరా తీసిన ముఖ్యమంత్రి, సంస్థ లాభాల్లో ఉద్యోగుల వాటాను మరో రెండు శాతం పెంచారు.

సంస్థ లాభాల్లో 25 శాతం వాటా కార్మికులకు కేటాయిస్తూ గతంలో ఆదేశాలు ఇచ్చిన సీఎం.. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగులకు 27శాతం వాటా ఇస్తామని ప్రకటించారు. లాభాలలో పెంచిన వాటా ప్రకారం కార్మికులకు ఇవ్వాలని సింగరేణి సిఎండి శ్రీధర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇకపై సింగరేణిలో కార్మికులను వర్కర్లు అని పిలవవద్దని, వారిని కూడా ఉద్యోగులుగానే సంబోధించాలని సీఎం చెప్పారు. యాజమాన్యం, కార్మికులు వేర్వేరు అనే భావన ఉండొద్దని, అంతా ఒక కుటుంబమనే భావన పెంపొందాలని సూచించారు.

  సింగరేణి అధికారులు హైదరాబాద్ లో ఇండ్లు నిర్మించుకోవడానికి అవసరమైన స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల మాదిరిగానే సంస్థలోని అందరు అధికారులు, ఉద్యోగులకు కూడా ఇంటి నిర్మాణం కోసం వడ్డీ లేకుండా పది లక్షల రూపాయల రుణాన్ని అందివ్వాలని అధికారులను ఆదేశించారు. 

  • Loading...

More Telugu News