Vizag: విద్యార్థినిపై కరస్పాండెంట్ లైంగిక వేధింపులు... నిజమేనన్న భార్య!

  • ఇంటికి పిలిచి వేధింపులు
  • కరస్పాండెంట్ కే మద్దతిచ్చిన ప్రిన్సిపాల్
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

ఒకేషనల్ జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ, విద్యార్థులు రోడ్డుకెక్కిన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకోగా, అతని భార్య సైతం విద్యార్థినులకు మద్దతు పలికి, తన భర్త చేసే దుర్మార్గాలను బయటపెట్టింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, విశాఖ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో గాది వెంకట సత్య నరిసింహ కుమార్‌ కరస్పాండెంట్ గా పని చేస్తున్నాడు. ఆయన తల్లి ఇటీవల మరణించడంతో, ఇంట్లో పనులు ఉన్నాయని చెబుతూ, తన వద్ద చదివే ఓ బాలికను ఇంటికి పిలిచి లైంగిక దాడికి యత్నించాడు. అతని కాళ్లు పట్టుకుని బతిమిలాడి, అక్కడి నుంచి బయటపడిన బాలిక, విషయాన్ని ఇతర స్టూడెంట్స్ కు చెప్పి, కరస్పాండెంట్ ను నలుగురి ముందూ నిలదీసింది.

ప్రిన్సిపాల్ గ్లోరీ సైతం తమకు మద్దతు తెలపకుండా, కరస్పాండెంట్ కే మద్దతిచ్చారని ఆరోపిస్తూ, పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. కాగా, విద్యార్థినికి మద్దతు తెలిపిన నిందితురాలి భార్య, గతంలోనూ నరిసింహ కుమార్ పై మూడు లైంగిక వేధింపుల కేసులున్నాయని తెలిపింది. నర్సీపట్నంలో కళాశాలను నడిపిన వేళ, పోలీసు కేసులు నమోదైనాయని, అక్కడ కాలేజీలు మూసి ఇక్కడికి వచ్చాడని చెప్పిన ఆమె, కాలేజీ ప్రిన్సిపాల్ గ్లోరీ తన భర్తతో సంబంధం పెట్టుకుందని ఆరోపించింది. తన భర్తను తనకు కాకుండా చేస్తోందని, వారిద్దరికీ శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేసింది.

More Telugu News