Kerala: కేరళకు కోహ్లీ 84 కోట్లు, రొనాల్డో 77 కోట్ల సాయం.. సోషల్ మీడియాలో వార్తలు.. అసలు నిజం ఇదీ!

  • కేరళ వరద సాయంపై సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్
  • ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేస్తూ వైరల్ చేస్తున్న వైనం
  • విషాదంలో పరాచికాలు తగవంటూ హితవు పలుకుతున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకటే చర్చ. కేరళ వరదలకు పోర్చుగీసుకు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో చలించిపోయాడు. మనసు కకావికలమై ఏకంగా రూ.77 కోట్లను విరాళంగా ప్రకటించాడు. అతడి ఔదార్యానికి భారత నెటిజన్లు ఫిదా అయ్యారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రూ. 5 కోట్లు, పది కోట్లు ప్రకటిస్తే ఓ ఆటగాడు ఏకంగా రూ.77 కోట్లు ప్రకటించడంపై అందరూ హ్యాట్సాఫ్ చెబుతూ ప్రశంసలు కురిపించారు. అతడిని చూసి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న మన ఆటగాళ్లు నేర్చుకోవాల్సినది ఎంతో ఉందని, అతడిని చూసి నేర్చుకోండంటూ దుమ్మెత్తి పోశారు.

ఒక్క రొనాల్డోనే రూ.77 కోట్లు ఇస్తే భారత ప్రభుత్వం ఎంతివ్వాలని, ఏదో మొక్కుబడిగా సాయం చేసి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు టీమిండియా సారథి కోహ్లీ కూడా రూ.84 కోట్లను విరాళంగా ప్రకటించాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇవన్నీ తప్పుడు వార్తలని, ఎవరో పనిలేని వ్యక్తులు చేసిన పని ఇదని తేలింది.

 ఎవరో పెట్టిన పోస్టులో నిజానిజాలు తెలుసుకోకుండా, లైకులు, షేర్లు, కామెంట్లతో ఇలా వైరల్ చేయడం తగదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విషాదంలో ఇలాంటి పరాచికాలు తగదని హితవు పలుకుతున్నారు. కాగా, తమిళ హీరో విజయ్ రూ.14 కోట్లు ఇచ్చినట్టు కూడా ఓ న్యూస్ హల్‌చల్ చేసింది. అయితే, తాజాగా విజయ్ రూ.70 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడంతో ఫేక్‌న్యూస్‌కు అడ్డుకట్ట పడింది.

More Telugu News