Baba Ramdev: కింభో యాప్ రీలాంచ్‌కు ముందు పతంజలికి షాక్.. యాప్‌ను డిజైన్ చేసిన అదితి గుడ్‌బై!

  • ఈ నెలలో కింభోను తిరిగి విడుదల చేయనున్న పతంజలి
  • పతంజలితో భేదాభ్రిప్రాయాలు
  • ‘బోలో మెసేంజర్’ యాప్‌ను పునరుద్ధరించడంలో అదితి బిజీ

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా రామ్‌దేవ్ బాబా పతంజలి హడావుడిగా ‘కింభో’ యాప్‌ను విడుదల చేసి, ఆ తర్వాత వెనక్కి తీసుకుని అభాసుపాలైంది. అందులోని లోపాలను సరిచేసి మరిన్ని ఫీచర్లు జోడించి ఈ నెలలో మరోమారు విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే దానిని గూగుల్ ప్లే స్టోర్‌లో పెట్టింది.

పతంజలి కింభో యాప్‌‌ను అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదితి కమల్ డిజైన్ చేశారు. గతంలో ఆమె గూగుల్, యాహూ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలలో పనిచేశారు. కింభో యాప్ రీలాంచ్‌కు సిద్ధమవుతున్న వేళ పతంజలికి అదితి షాకిచ్చారు. ఈ ప్రాజెక్టుకు గుడ్ బై చెప్పేసి బయటకొచ్చారు. గతంలో ఆమె తీసుకొచ్చిన ‘బోలో మెసేంజర్’ యాప్‌ను పునరుద్ధరించి తిరిగి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల 21న అదితి ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకు రానున్నారు.

కింభో ప్రాజెక్టు నుంచి అదితి తప్పుకోవడంపై పతంజలి ఆయుర్వేద సీఈవో ఆచార్య బాలకృష్ణ స్పందించారు. అదితి తమ అంచనాలను అందుకోలేకపోయారని, అభిప్రాయ భేదాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అదితి మాట్లాడుతూ తాను జూలైలోనే పతంజలి నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. కొన్ని విషయాల్లో భేదాభ్రిపాయాలు ఉన్నట్టు చెప్పారు.

More Telugu News