Tamilnadu: సైకిల్ కోసం దాచుకున్న డబ్బును వరద బాధితులకు ఇచ్చేసిన చిన్నారి.. బంపరాఫర్ ఇచ్చిన హీరో కంపెనీ!

  • కేరళ వరద బాధితులకు రూ.9 వేలు ఇచ్చిన అనుప్రియ
  • నాలుగేళ్లుగా ఈ సొమ్మును దాచుకున్న చిన్నారి
  • జీవితాంతం ఏటా ఓ సైకిల్ ఇస్తామని ప్రకటించిన హీరో సంస్థ
పిల్లలు మనసులో ఏదీ దాచుకోరు. ఆనందం వస్తే నవ్వుతారు. బాధ అనిపిస్తే ఏడుస్తారు. మనసులో కల్మషం, ఈర్ష్య అన్నవి వాళ్లకు అస్సలు తెలియవు. అందుకే పిల్లలను దేవుళ్లతో పోలుస్తారు. ప్రస్తుతం కేరళలో వరదలు విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీవీలో వరద బీభత్సాన్ని చూసిన ఓ చిన్నారి సైకిల్ కొనేందుకు నాలుగేళ్లుగా హుండీలలో దాచుకుంటున్న రూ.9,000లను వరద బాధితులకు ఇచ్చేసింది.

తమిళనాడులోని విల్లుపురంకు చెందిన చిన్నారి అనుప్రియ కేరళ వరద వార్తలను టీవీలో చూసింది. తీవ్రంగా చలించిపోయిన ఆ బాలిక తన ఐదు హుండీల్లో దాచుకున్న రూ.9 వేలను సీఎం సహాయ నిధికి పంపింది. ఈ విషయం పత్రికల ద్వారా వెలుగులోకి రావడంతో హీరో సైకిల్స్ కంపెనీ స్పందించింది.

అనుప్రియను అభినందించిన హీరో సైకిల్స్ సంస్థ.. ఆమెకు కొత్త సైకిల్ ను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం అడ్రస్ ను తమ కస్టమర్ కేర్ ఈ-మెయిల్ కు పంపాలని ట్విట్టర్ లో సంస్థ కోరింది. ఇంతలోనే హీరో సైకిల్స్ ఎండీ పంకజ్ ముంజల్ కూడా స్పందించారు. చిన్నారి అనుప్రియకు ప్రతిఏటా ఓ సైకిల్ చొప్పున జీవితాంతం అందిస్తామని ప్రకటించారు. దీంతో అనుప్రియ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Tamilnadu
ANU priya
Rs.9000
hero cycles
pankaj munjal

More Telugu News