Congress: జనసేనలోకి పంతం నానాజీ.. తూర్పుగోదావరిలో కాంగ్రెస్‌కు షాక్

  • జనసేన విధివిధానాలు నచ్చడంతోనే పార్టీలోకి
  • పార్టీ టికెట్ ఆశించడం లేదన్న నానాజీ
  • కాంగ్రెస్‌తో తనకు విభేదాలు లేవని స్పష్టీకరణ
తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ పార్టీకి గుడ్‌ బై చెప్పనున్నట్టు ప్రకటించారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే జనసేనలో చేరబోతున్నట్టు తెలిపారు. పవన్ కల్యాణ్ విధివిధానాలు నచ్చడంతోనే ఆ పార్టీలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే జనసేనలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. అయితే, పార్టీ టికెట్‌ను మాత్రం ఆశించడం లేదని పేర్కొన్న నానాజీ జనసేన విధివిధానాలు తనకు నచ్చాయని పునరుద్ఘాటించారు. పవన్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో పార్టీలో చేరుతానని నానాజీ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీతో తనకు ఎటువంటి విభేదాలు లేవని నానాజీ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత పార్టీకి మనుగడ లేదని తెలిసినా పార్టీ మారకుండా సేవలు అందించానన్నారు. కాంగ్రెస్‌ను వీడుతున్నా తన వెంట ఒక్క కార్యకర్తను కూడా తీసుకెళ్లడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో 32 ఏళ్ల పాటు పనిచేశానని, ఎన్నో పదవులు అధిష్ఠించానని నానాజీ వివరించారు. కాగా, నానాజీ పార్టీ వీడడం జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్ద షాకేనని చెబుతున్నారు.
Congress
East Godavari District
Kakinada
Pantam Nanaji
Jana sena
Pawan Kalyan

More Telugu News