ATM: ఏటిఎంలో డబ్బు నింపేందుకు సమయాలను నిర్ణయించిన హోం శాఖ!

  • ఇక రాత్రుళ్లు ఏటీఎంలలో డబ్బులు నింపకూడదని హోం శాఖ నిర్ణయం 
  • ఏటిఎంలలో డబ్బులు తీసుకెళ్ళే వాహనాలకు కూడా నిబంధనలు 
  • భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడి

కేంద్ర హోం శాఖ ఏటీఎంలలో డబ్బులు నింపే ప్రక్రియపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక నుండి రాత్రి సమయాల్లో ఏటీఎంలలో డబ్బులు నింపరు. ఒకవేళ ఏటీఎంలలో డబ్బులు ఖాళీ అయినా సరే మరుసటి రోజు వరకు ఆగాల్సిందేనట. మహా నగరాల్లోని ఏటీఎం సెంటర్లలో రాత్రి 9 దాటిన తర్వాత, గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలలో సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత, జిల్లా కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు ముందు, సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత ఏటీఎంలలో నగదును చేర్చే పద్ధతికి స్వస్తి చెప్పనున్నారు.

అంతేకాదు, భద్రతాపరమైన చర్యల నేపథ్యంలో ఏటీఎంలకు డబ్బులు తీసుకెళ్ళే విధానంలోనూ ఏజెన్సీలకు కఠినమైన నిబంధనలు పెట్టింది కేంద్ర హోం శాఖ. వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఏటిఎంలకు డబ్బును తీసుకెళ్ళే వ్యాన్లను జీపీఎస్‌తో అనుసంధానం చెయ్యాలి. డబ్బును తీసుకెళ్లే ఆయా ఏజెన్సీలు నగదును తరలించే వాహనాలకు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేయాలి.

అలాగే ప్రయివేటు ఏజెన్సీలు సెక్యూరిటీ గార్డులుగా నియమించే వ్యక్తుల విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. వారిపూర్తి వివరాలు సేకరించిన తరువాతే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవాలి. నగదు రవాణా చేసేటప్పుడు కావాల్సిన సెక్యూరిటీ కోసం ఎక్స్‌ సర్వీస్‌ మ్యాన్‌లను కూడా తీసుకోవచ్చు. వాహనాన్ని గుర్తించే విధంగా నంబరు ప్లేట్లు ఉండాలి. క్యాష్‌ వ్యాన్‌లో చిన్న సీసీటీవీ కూడా ఉండాలి. ఆ పుటేజీ ఏజెన్సీతో అనుసంధానమై ఉండాలి. దీంతోపాటు నగదును తరలించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందిని పంపాలి.

ప్రతి వాహనంలోనూ ఒక డ్రైవర్‌, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు ఏటీఎం ఆఫీసర్లు ఉండాలి. నగదు ఉన్న ప్రతి బాక్సును ప్రత్యేక లాకర్లతో లాక్‌ చేయాలి. వాటి తాళాలు ఏటీఎం ఆఫీసర్ల వద్ద ఉండాలి. సెక్యూరిటీ గార్డుల్లో ఒక ఆర్మీగార్డు డ్రైవర్ పక్కనే కూర్చోవాలి. మరొకరు నగదును కనిపెడుతూ ఉండాలి. నగదును ఏటీఎంలో వేస్తున్నప్పుడు కానీ వ్యానులో నుంచి తీస్తున్నప్పుడు గానీ లేదా టీ, భోజనవిరామం తీసుకున్నట్లయితే ఒక సెక్యూరిటీ గార్డు తప్పని సరిగా నగదును తరలిస్తున్న వ్యానులో ఉండాలి. ఈ నిబంధనలను భద్రతా కారణాలతోనే తీసుకుంటున్నట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది.

ATM

More Telugu News