tribal areas: గిరిజన ప్రాంతాల్లో విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: ఏపీ సీఎస్ ఆదేశాలు

  • ఐటీడీఏ ప్రాంతాల్లో సౌకర్యాల మెరుగుపై సంతృప్తి
  • ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి
  • గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో సీఎస్ దినేష్ కుమార్  

గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధి, అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆ శాఖ అధికారులను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్ కుమార్ ఆదేశించారు. ఏపీ సచివాలయంలోని సీఎస్ సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ శాఖ సమీక్షా సమావేశం ఈరోజు జరిగింది.

ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి నివాస ప్రాంతానికి పాఠశాల అందుబాటులో ఉండే విధంగా, డ్రాప్ అవుట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐటీడీఏ ప్రాంతాల్లో రోడ్లు, మొబైల్, వైద్య సౌకర్యాలు మెరుగుపడటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మొట్టమొదట సారిగా పార్వతీపురం ఐటీడీఏ అధికారిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాము చాలా దూరం నడిచి వెళ్లేవారమని, నాటితో పోల్చుకుంటే ఇప్పుడు రోడ్డు సౌకర్యం చాలా మెరుగుపడిందని, ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని అన్నారు.

జాతీయ స్థాయిలో రాష్ట్రంలో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు, అదేవిధంగా ఐటీడీఏ పరిధిలో కూడా వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయని చెప్పారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంపై దినేష్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన నివాస ప్రాంతాలన్నింటికీ బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలని, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మండల పరిషత్ పాఠశాలలు, గిరిజన పాఠశాలలు, గిరిజన గురుకుల పాఠశాల పనితీరు, నరేగా పనులను సమీక్షించారు. గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటం కోసం, గిరిజన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ లభించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ‘గిరిబాట’కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెయ్యి కోట్ల రూపాయలను ఇటీవలే మంజూరు చేశారని అన్నారు. ఆ నిధులతో త్వరలో పనులు ప్రారంభించనున్న విషయాన్ని దినేష్ కుమార్ కు అధికారులు వివరించారు. 

More Telugu News