Kerala: కేరళ వరదలలో 167మంది దుర్మరణం

  • కేరళను అతలాకుతలం చేస్తున్న వర్షాలు 
  • ఇప్పటికి 167మంది మృత్యువాత 
  • 13 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వం 

కేరళ రాష్ట్రంలో వరదలతో మరణ మృదంగం మ్రోగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలు ముంపుకు గురయ్యాయి. వేలాది ఇళ్ళు నేలమట్టం కావటంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. రహదారులు దెబ్బతిన్నాయి. సహాయక చర్యలకు సైతం కురుస్తున్న వర్షాలు ఆటంకం కలిగిస్తున్నాయి.

 వరదలతో కేరళ రాష్ట్రంలో ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 167 మంది ప్రాణాలు కోల్పోయారని కేరళ ముఖ్యమంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్‌ వెల్లడించారు. 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం కేరళలో ఎన్డీఆర్‌ఎఫ్, ఇండియన్ కోస్ట్‌గార్డ్, భారత సైన్యం, వాయుసేన దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

 వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోదీ విజయన్‌తో ఫోన్లో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, సమీక్షించడానికి ప్రధాని నేడు కేరళకు వెళుతున్నారు.  

More Telugu News