Interview: రాజీవ్ శుక్లా వేసిన ప్రశ్న విని కన్నీరు పెట్టిన వాజ్ పేయి!

  • తొలిసారిగా ప్రధాని కాబోతున్న వేళ ఇంటర్వ్యూ చేసిన శుక్లా
  • ప్రజలకు దూరమవుతున్నానని కన్నీరు
  • నిష్కళంక రాజకీయ నేత వాజ్ పేయని కొనియాడిన శుక్లా

ఓ కవిగా, మానవతావాదిగా, అంతకుమించి నిష్కళంకుడైన రాజకీయ నేతగా, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన అటల్ బిహారీ వాజ్ పేయి, ఓ ఇంటర్వ్యూలో మాజీ జర్నలిస్టు, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా అడిగిన ప్రశ్న విని కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని రాజీవ్ శుక్లా స్వయంగా గుర్తు చేసుకుంటూ, "నేను వాజ్ పేయిని 1996లో ఇంటర్వ్యూ చేశాను. ఆయన ప్రధాని కాబోతున్న వేళ ఇది జరిగింది. మీరు ప్రధాని కాబోతున్నారు. రేపటి నుంచి మీ చుట్టూ భద్రతా వలయం ఏర్పడుతుంది. మీరు ఇక ప్రజలను దూరం నుంచి కలవాల్సిందే.... అని అంటుండగా, ఆయన ఏడుపు ప్రారంభించారు. తనకు ప్రజలు దూరమవుతారన్న బాధ ఆయనలో స్పష్టంగా కనిపించింది" అని అన్నారు.

ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ప్రతిపక్షాలు కూడా సౌకర్యవంతంగా కనిపించేవని, కక్షపూరిత చర్యలకు ఆయన వ్యతిరేకమని, అందువల్లే ఆయనంటే ఎంతో మందికి ప్రేమని రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు. సమకాలీన రాజకీయ నేతలతో పోలిస్తే, ఆయన ఆలోచనా ధోరణి విభిన్నమైనదని చెప్పారు. నేటి తరం నేతలు ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవాల్సివుందని అన్నారు. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రిల జీవితాల్లోని మంచి లక్షణాలను అందిపుచ్చుకుని ఎదిగిన వాజ్ పేయి, గొప్ప వక్తని కొనియాడారు.

More Telugu News