mithali raj: మిథాలీ రాజ్ పై ఇంటర్నెట్ లో విమర్శలు.. హుందాగా స్పందించిన క్రికెటర్!

  • స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడంలో ఆలస్యం
  • మిథాలీపై మండిపడ్డ నెటిజన్
  • హుందాగా జవాబిచ్చి మనసు దోచుకున్న క్రికెటర్
భారత మహిళ క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పై నెటిజన్ ఒకరు గురువారం మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు కాకుండా మిథాలీ రాజ్ ఒకరోజు ఆలస్యంగా శుభాకాంక్షలు చెప్పడమే ఇందుకు కారణం. అయితే అసలు విషయాన్ని పట్టించుకోకుండా తనపై విమర్శలకు దిగిన సదరు వ్యక్తి విషయంలో మిథాలీ హుందాగా ప్రవర్తించింది. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం టీ20 చాలెంజర్స్ టోర్నీలో ఆడుతున్న మిథాలీ ఆగస్టు 15న కాకుండా మరుసటి రోజు దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ‘మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం కోసం చాలామంది ప్రాణత్యాగం చేశారు. వారి ఆత్మ బలిదానాలను గౌరవిద్దాం. పేదరికం, ఆకలి, వివక్ష, లైంగిక వేధింపుల నుంచి దేశం స్వేచ్ఛ పొందాలని ఆశిద్దాం. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జైహింద్’ అని ట్వీట్ చేసింది.

అయితే ఓ నెటిజన్ ‘మీరు సెలబ్రిటీ అయ్యుండి ఇలా ఆలస్యంగా శుభాకాంక్షలు చెప్పడం సరికాదు’ అని వ్యాఖ్యానించాడు. దీనికి వెంటనే స్పందించిన మిథాలీ..‘నాకు సెలబ్రిటీ హోదా ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ప్రస్తుతం నేను చాలెంజర్స్ టోర్నీలో ఆడుతున్నా. మ్యాచ్ జరుగుతున్నంత సేపు మా వద్ద సెల్ ఫోన్ ఉండదు. అందుకే శుభాకాంక్షలు చెప్పడం ఆలస్యమైంది. నేను చెప్పింది సరైన కారణమనే భావిస్తున్నా’ అని ట్వీట్ చేసింది. కాగా కొందరు నెటిజన్లు మిథాలీ సరైన జవాబిచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు.
mithali raj
Cricket
India
challengers tourny
Twitter
troll

More Telugu News