Rajasthan: బీజేపీకి షాకే... ఆ మూడు రాష్ట్రాల్లో గెలిచేది కాంగ్రెస్సే: ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ సర్వే

  • రాజస్థాన్ లో అనూహ్య విజయం సాధించనున్న కాంగ్రెస్ 
  • 21 నుంచి 130కి పెరగనున్న కాంగ్రెస్ సీట్లు
  • మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ కూడా ఆ పార్టీ ఖాతాలోకే

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయనుందని ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుందని, బీజేపీకి పెను షాక్ తగలనుందని పేర్కొంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ ఘన విజయం ఖాయమని, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లో పోరు తీవ్రంగా జరుగుతుందని, స్వల్ప మెజారిటీతోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెస్సేనని తెలియజేసింది.

ఈ సర్వే అంచనాల ప్రకారం...
రాజస్థాన్ లో 200 సీట్లు ఉండగా, 2013లో 163 స్థానాల్లో గెలిచిన బీజేపీ, ఈ దఫా 21 సీట్లకు పరిమితం కానుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ సీట్ల సంఖ్య 57 నుంచి 130కి పెరగనుంది. ఇతరులు 13 చోట్ల విజయం సాధించనున్నారు.

మధ్యప్రదేశ్ విషయానికి వస్తే, మొత్తం 230 సీట్లు ఉండగా బీజేపీ సీట్లు 165 నుంచి 106కు తగ్గనుండగా, కాంగ్రెస్ 117 సీట్లలో విజయం సాధిస్తుంది. 2013లో కాంగ్రెస్ గెలిచిన సీట్లు 58 మాత్రమే. ఇతరులు 7 స్థానాలకు పరిమితం కానున్నారు.

ఇక చత్తీస్ గఢ్ విషయానికి వస్తే, మొత్తం 90 సీట్లు ఉండగా, 2013లో 49 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ, ఇప్పుడు 33కు పరిమితం కానుంది. కాంగ్రెస్ గెలిచే అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 39 నుంచి 54కు పెరగనుంది. ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధిస్తారు.

More Telugu News