india: భారత కరెన్సీ కూడా 'మేడ్ ఇన్ చైనా' యేనట.. ఆందోళన వ్యక్తం చేసిన శశిథరూర్!

  • భారత్ తో పాటు శ్రీలంక, మలేసియా కూడా
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు
  • రహస్యాలు పాకిస్తాన్ కు చేరిపోవచ్చని హెచ్చరిక

మన కరెన్సీని ఎక్కడ ముద్రిస్తారు? అని ఎవరైనా అడిగితే రిజర్వ్ బ్యాంక్ ప్రింటింగ్ ప్రెస్సుల్లో అని ఠక్కున్న సమాధానమిస్తాం. కానీ ఇకపై ఈ జవాబును మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భారత కరెన్సీని ముద్రించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం జిత్తుల మారి చైనాకు అప్పగించింది కాబట్టి!


అవును మీరు విన్నది నిజమే. భారత ప్రభుత్వం కరెన్సీ నోట్ల ముద్రణను చైనాకు అప్పగించింది. ఈ మేరకు  సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత్ తో పాటు థాయ్ లాండ్, శ్రీలంక, వియత్నాం, బంగ్లాదేశ్, పోలెండ్, బ్రెజిల్, మలేసియా తదితర దేశాలు ఇందుకోసం చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపింది. ఈ నోట్లను చైనాలోని ప్రభుత్వరంగ బ్యాంక్ నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ముద్రిస్తుందని వెల్లడించింది.

ఇప్పటివరకూ యూరప్ దేశాలు ఈ రంగంలో ముందంజలో ఉండగా, క్రమంగా చైనా వాటి స్థానాన్ని అక్రమిస్తోందని పేర్కొంది. ఈ నోట్ల ముద్రణ విషయాన్ని బయటకు వెల్లడించవద్దని చైనా ప్రభుత్వాన్ని ఈ దేశాలు కోరాయని తెలిపింది. ఒకవేళ ఈ విషయం బయటపడితే రాజకీయంగా తమకు ఇబ్బందులు ఎదురవుతాయని కొన్ని దేశాల ప్రభుత్వాలు చెప్పినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.

చైనాకు కరెన్సీ ముద్రణ ఆర్డర్ ఇచ్చిన దేశాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పింది. కాగా, డోక్లాం, అరుణాచల్ ప్రదేశ్ లతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ‘వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టు’తో రెచ్చిపోతున్న చైనాకు దేశ కరెన్సీ గుట్టును అప్పగించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా ఈ సాంకేతికతను పాక్ కు అప్పగించే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.

కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ స్పందించారు. దీని కారణంగా పాకిస్తాన్ చేతికి భారత కరెన్సీ రహస్యాలు చేరిపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. 

More Telugu News