Rajya Sabha: టాకౌట్ లేదా వాకౌట్... రెండూ కాకుంటే ఆలౌటే: వెంకయ్యనాయుడు

  • రాజ్యసభ చైర్మన్ గా ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న వెంకయ్యనాయుడు
  • సభలో అవాంతరాలు ఉండరాదన్న వెంకయ్య
  • ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయిమని వెల్లడి

రాజ్యసభలో చర్చలతో ప్రభుత్వాన్ని ఢీకొట్టాలని, లేకుంటే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోవాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. రాజ్యసభ చైర్మన్ గా ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, రాజ్యసభకు బ్రేక్ అవుట్ (అవాంతరాలు) ఉండకూడదన్నదే తన ఉద్దేశమని, విపక్షాలు 'టాకౌట్' లేదా 'వాకౌట్' చేయాలని, అలా జరుగకుంటే ప్రజాస్వామ్యం 'ఆలౌట్' అయినట్టేనని వ్యాఖ్యానించారు.

సభలో తమ నిరసనలను తెలుపుతూ, చర్చలకు అడ్డుగా మాత్రం ఉండరాదని హితవు పలికారు. విపక్షాలు తాము చెప్పేది చెప్పాలని, ప్రభుత్వం కూడా తన పద్ధతిలో తాను చెప్పేది చెబుతూనే ఉంటుందని గుర్తు చేసిన ఆయన, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని తేల్చారు. కాగా, దేశంలోని 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో ఆయన ఉపరాష్ట్రపతిగా అధికారిక పర్యటనను చేసిన వెంకయ్య, విద్యార్థులు, రైతులు, యువతకు వివిధ అంశాలపై తన సలహాలు, సూచనలు అందిస్తున్నారు.

More Telugu News