Jagan: మీ భార్య భారతి మాత్రమే మహిళా?... శ్రీలక్ష్మి, సబిత, రత్నప్రభల సంగతేంటి?: విరుచుకుపడిన ఏపీ మంత్రులు

  • శ్రీలక్ష్మి జైలుకు వెళ్లినప్పుడు లేఖలు రాయలేదేం?
  • వారు మహిళలన్న సంగతి గుర్తుకు రాలేదా?
  • జగన్ పై మండిపడ్డ కళా వెంకట్రావు, దేవినేని, చినరాజప్ప

తన కుటుంబ సభ్యులను కేసుల్లోకి లాగేందుకు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రులు విరుచుకుపడ్డారు. అవినీతి ఆస్తులను భార్య పేరిట పెట్టి జగన్ తప్పు చేస్తే, ఆ తప్పును సమర్థించిన భారతి శిక్షార్హురాలేనని కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. జగన్ తన అవినీతికి భార్యను బాధ్యురాలిని చేశారని ఆరోపించిన ఆయన, జగన్ అవినీతి కేసుల్లోనే ఐఏఎస్ అధికారిణులు రత్నప్రభ, శ్రీలక్ష్మి జైలుకు వెళ్లి వచ్చారని గుర్తు చేశారు. వారు జైలుకు వెళ్లినప్పుడు లేఖలు రాయని జగన్, ఇప్పుడు తన భార్య పేరు వచ్చేసరికి సానుభూతి పొందాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. రత్నప్రభ, శ్రీలక్ష్మి, అప్పటి హోమ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి... వీరంతా మహిళలేనని, వారిపై ఆరోపణలు వచ్చినప్పుడు ఇలా బహిరంగ లేఖలు ఎందుకు రాయలేదని వెంకట్రావు ప్రశ్నించారు.

చేసిన తప్పులకు పశ్చాత్తాప పడి, అవినీతి డబ్బును ప్రభుత్వపరం చేసి, కేసులు లేకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు. జగన్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడని, నెల రోజుల క్రితం చార్జిషీట్ ను ఈడీ దాఖలు చేస్తే పత్రికలకు సమాచారం రాకుండా ఎలా ఉంటుందని హోమ్ మంత్రి చినరాజప్ప ప్రశ్నించారు. జగన్ దోచుకున్న సొమ్మునంతా ప్రజలకు ఇచ్చేయాలని మరో మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. అన్ని ఆధారాలూ ఉండబట్టే భారతి పేరును నిందితురాలిగా చేర్చి ఉంటారని మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించగా, తన భార్య పేరు బయటకు రావడంతో జగన్ బెంబేలెత్తారని ఆనంద బాబు అన్నారు. తాను చేసిన తప్పులను ఇతరుల పైకి నెడుతూ, అధికారులను భయపెట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

More Telugu News