jagan: వైయస్ భారతి, బ్రదర్ అనిల్ పై సీబీఐ కేసు నమోదు చేయాలి: వర్ల రామయ్య

  • అక్రమాస్తుల్లో భారతి పాత్ర ఈడీకి కనిపించినప్పుడు.. సీబీఐకి ఎందుకు కనిపించలేదు?
  • ఏడాదిలో 84 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే స్థాయికి జగన్ ఎదిగాడు
  • అనిల్ శాస్త్రి మొదటి భార్య, పిల్లలతో అద్దె ఇంట్లో ఉండేవారు

వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన భార్య భారతిపై సీబీఐ కేసు నమోదు చేయాలని టీడీపీ నేత, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య డిమాండ్ చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ భారీ సంపదను కూడగట్టారని... ఆయనకు చెందిన బ్లాక్ మనీని వైట్ గా మార్చడంలో ఉపయోగపడిన అనిల్ శాస్త్రి అలియాస్ బ్రదర్ అనిల్ కుమార్ (షర్మిల భర్త)ను కూడా నిందితుల జాబితాలో చేర్చాలని కోరారు.

అప్పుల్లో ఉన్న జగన్ రూ. 3 లక్షల పన్ను చెల్లించే స్థితి నుంచి ఏడాదిలోపే రూ. 84 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే స్థాయికి ఎదగడం దేశంలోని ఏ ఆడిటర్ కు అర్థంకావడం లేదని వర్ల అన్నారు. వైయస్ సీఎంగా ఉన్న సమయంలో వారికి అనుకూలంగా ఒకే రోజు 389 జీవోలను జగన్ తెప్పించుకున్నారని... అలాంటి వ్యక్తి నీతులు మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేవారు. మోదీ, అమిత్ షాల అండతో తనకు ఏమీ కాదని జగన్ అనుకుంటున్నారని... కానీ, ఆయన జైలుకు వెళ్లకుండా దేవుడు కూడా కాపాడలేడని అన్నారు.

జగన్ అక్రమాస్తుల్లో భారతి పాత్ర ఈడీకి కనిపించినప్పుడు... సీబీఐకి ఎందుకు కనిపించడం లేదని వర్ల ప్రశ్నించారు. జగన్ పై ఉన్న 11 ఛార్జిషీట్లలో భారతితో పాటు బ్రదర్ అనిల్ కుమార్ ను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. అనిల్ శాస్త్రి తొలుత మొదటి భార్య, పిల్లలతో కలసి అద్దె ఇంట్లో ఉన్నారని... వైయస్ అల్లుడు అయ్యాక, బ్రదర్ అనిల్ కుమార్ గా మారి 11 కంపెనీల్లో డైరెక్టర్ అయ్యారని చెప్పారు.

More Telugu News