serlimgampally: గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎంను కొల్లగొట్టిన దొంగలు.. గంటలోనే రూ.13 లక్షలతో జంప్!

  • ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలలో భారీ చోరీ
  • గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసిన దుండగులు
  • దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. ఓ కారులో గ్యాస్ కట్టర్ తో వచ్చిన దొంగలు గంటలోపే రెండు ఏటీఎంలను కొల్లగొట్టి రూ.13 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన తారానగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఉదయం 3.42 గంటల సమయంలో నలుగురు దొంగలు తారానగర్ లోని ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం సెంటర్ వద్దకు వచ్చారు. తొలుత లోపలకు వెళ్లిన దొంగలు అలారంను ఆపేశారు. అనంతరం ఒకరు బయట కాపలా ఉండగా, మిగిలిన ముగ్గురు గ్యాస్ కట్టర్ లతో లోపలకు ప్రవేశించారు. కరెన్సీ నోట్లు ఏమాత్రం కాలిపోకుండా జాగ్రత్తగా రెండు ఏటీఎంలను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి రూ.13,50,000 నగదును దోచుకెళ్లారు. ఈ మొత్తం పనిని కేవలం గంటలోనే పూర్తిచేసి ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. ఉదయం ఏటీఎంను గమనించిన బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు.

కాగా, రెండు ఏటీఎంలను దోచుకున్న దొంగలు, అక్కడే ఉన్న మరో ఏటీఎంను తాకకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తెలిసినవాళ్ల పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై చందానగర్ సీఐ తిరుపతి రావు ఆధ్వర్యంలో విచారణ బృందాన్ని ఉన్నతాధికారులు నియమించారు.

More Telugu News