Rajya Sabha: కేంద్రానికి ఝలక్ ఇచ్చిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్.. ఓటింగ్‌కు అనుమతినిచ్చి ఇరకాటంలోకి నెట్టిన వైనం!

  • రాజ్యసభలో ప్రైవేటు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఎస్పీ సభ్యుడు
  • ఎస్సీ, ఎస్టీలు ఏ రాష్ట్రంలోనైనా అవే ఫలాలు అందుకునేలా రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్
  • రూలింగ్ ఇచ్చాక వెనక్కి తీసుకోవడం కుదరదన్న డిప్యూటీ చైర్మన్

ఎన్డీయే అభ్యర్థిగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ సింగ్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఓ ప్రైవేటు తీర్మానంపై ఓటింగ్‌కు అనుమతినిచ్చి కేంద్రాన్ని ఇరకాటంలోకి నెట్టేశారు. అయితే, ఆ సమయంలో విపక్ష సభ్యులు ఎక్కువమంది సభలో లేకపోవడంతో ప్రభుత్వం బయటపడగలిగింది.

సమాజ్‌వాదీ సభ్యుడు విశ్వంభర్ ప్రసాద్ నిషాద్ సభలో ప్రైవేటు తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఓ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు మరో రాష్ట్రంలో కూడా అవే ఫలాలను అనుభవించేలా రాజ్యాంగాన్ని సవరించాలని తీర్మానంలో పేర్కొన్నారు. స్పందించిన సామాజిక న్యాయ శాఖా మంత్రి థవర్ చంద్ గెహ్లట్ దీనిని తిరస్కరించారు. దీంతో ఈ అంశంపై ఓటింగ్ నిర్వహించాలని విపక్షాలు పట్టుబట్టడంతో డిప్యూటీ చైర్మన్ సరే అన్నారు.

 వెంటనే స్పందించిన న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రైవేటు తీర్మానంపై చర్చకు అనుమతినివ్వడం అసాధారణమని పేర్కొంటూ విపక్షాల డిమాండ్‌పై అభ్యంతరం తెలిపారు. అయితే, డిప్యూటీ స్పీకర్ మాత్రం తగ్గలేదు. ఒకసారి రూలింగ్ ఇచ్చేశాక వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని, ఓటింగ్ నిర్వహిస్తున్నట్టు చెప్పి ఝలక్ ఇచ్చారు.

దీంతో అధికార బీజేపీ తీర్మానాన్ని ఓడించేందుకు అప్పటికప్పుడు పావులు కదిపింది. తమ సభ్యులను సభలోకి రప్పించేందుకు విప్‌లు పరుగులు పెట్టారు. చివరికి తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ప్రభుత్వం 66 ఓట్లతో తన పంతం నెగ్గించుకుంది. తీర్మానానికి అనుకూలంగా 32 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే, సభలో విపక్ష సభ్యులు ఎక్కువగా లేకపోవడం వల్లే ప్రభుత్వం బయటపడగలిగిందని చెబుతున్నారు. 

More Telugu News