Tamilnadu: కరుణానిధి విగ్రహం ఏర్పాటు... అనుమతి లేదంటూ తొలగింపు!

  • తమిళనాడు వేలూరు సమీపంలో ఘటన
  • బంగారు పూతతో విగ్రహాన్ని చేయించిన నేత
  • తొలగించిన రెవెన్యూ, పోలీసు అధికారులు

తమిళనాడులోని వేలూరులో కరుణానిధి మరణం తరువాత ఓ నేత ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయించగా, అనుమతి లేదంటూ పోలీసులు దాన్ని తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. వేలూరు వినాయకపురంలో కుడియాత్తం ఉత్తర డీఎంకే ప్రతినిధి కృష్ణమూర్తి, కరుణ మరణం తరువాత రెండున్నర అడుగుల విగ్రహాన్ని, పార్టీ జెండాను ప్రతిష్ఠించారు. రాతి విగ్రహాన్ని తయారు చేయించి, దానిపై బంగారు పూతపూయించి, కిందివైపున స్టాలిన్, దురై మురుగన్ (డీఎంకే శాసన సభాపక్ష ఉపనేత) చిత్రాలను చెక్కించారు.

ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించగా, పలువురు నివాళులు అర్పించారు. ఆపై రెవెన్యూ, పోలీసు అధికారులు వచ్చి, విగ్రహాన్ని తొలగించడంతో డీఎంకే కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తొలగించిన విగ్రహాన్ని కృష్ణమూర్తికే పోలీసులు అప్పగించగా, తాను అనుమతి తీసుకుని ఈ విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠిస్తానని కృష్ణమూర్తి చెప్పడంతో కార్యకర్తలు శాంతించారు.

More Telugu News