Kiki challenge: ముదురుతున్న ‘కికి’ చాలెంజ్ పిచ్చి.. ఈసారి రైలుతో.. యువకులకు కోర్టు భలే శిక్ష!

  • కదులుతున్న రైలు నుంచి దూకి కికి చాలెంజ్
  • సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో రంగంలోకి పోలీసులు
  • వారంలో మూడు రోజులు ప్లాట్‌ ఫాం శుభ్రం చేయాలంటూ శిక్ష విధించిన కోర్టు

‘కికి’ చాలెంజ్‌ను స్వీకరించొద్దు మొర్రో అని పోలీసులు ఎంతగా మొత్తుకుంటున్నా యువత మాత్రం పెడచెవిన పెడుతున్నారు. ఈ చాలెంజ్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతున్నా దీనిపై మోజును మాత్రం వీడడం లేదు. ఈ చాలెంజ్‌లో భాగంగా కదులుతున్న కారు నుంచి కిందికి దిగి డ్యాన్స్ చేసి మళ్లీ కారెక్కాలి.

ఇప్పుడీ చాలెంజ్‌లోకి కారు బదులు రైలు వచ్చి చేరింది. కొందరు యువకులు వినూత్నంగా కదులుతున్న రైలు నుంచి దిగి ఈ చాలెంజ్ చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని తెలిసినా డోంట్ కేర్ అంటున్నారు.

మహారాష్ట్రలోని విరార్‌ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు నిషాంత్‌ షా(20), ధ్రువ్‌ షా(23), శ్యాం శర్మ(24)  రైలుతో కికి చాలెంజ్ చేసి అందుకు ఫలితం అనుభవిస్తున్నారు. కదులుతున్న రైలు నుంచి ప్లాట్‌ఫాంపైకి దూకిన వీరు డ్యాన్స్‌లు చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇవి అలా అలా తిరిగి పోలీసులకు చేరాయి. దీంతో రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

విచారించిన కోర్టు వీరు ముగ్గురు కికి డ్యాన్స్ చేసిన విసాయ్ రైల్వే స్టేషన్‌ను వారానికి మూడుసార్లు శుభ్రం చేయాలని ఆదేశించింది. అంతేకాదు, శిక్షలో భాగంగా వారు స్టేషన్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు వీడియో తీసి దానిని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ వీడియోలను చూసిన తర్వాత ఇంకా ఏదైనా శిక్ష వేసే విషయంలో నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.  

More Telugu News