Lamborghini: కారు వేగంగా నడిపాడని రూ.32 లక్షల జరిమానా.. బ్రిటిషర్ కు దుబాయ్ పోలీసుల షాక్!

  • లంబోర్గిని కారుతో రోడ్లపై దూసుకెళ్లిన బ్రిటిషర్
  • నాలుగు గంటల్లోనే రూ.32 లక్షల ఫైన్
  • బ్రిటన్ ఎంబసీకి తెలిపిన అధికారులు

విదేశాలకు మనం వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పాస్ పోర్ట్ దగ్గరి నుంచి ఎక్కడ ఉంటున్నాం. ఏం చేస్తున్నాం తదితర వివరాలను అవసరమైతే పోలీసులకు అందించాల్సి ఉంటుంది. అలాంటిది అక్కడ ఏదైనా వాహనం నడపాలంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితే దుబాయ్ లో పర్యటిస్తున్న ఓ బ్రిటిషర్ కు ఎదురైంది.

బ్రిటన్ యువకుడు(25) ఒకరు ఇటీవల దుబాయ్ పర్యటనకు వచ్చాడు. ఎత్తైన బిల్డింగులు, విశాలమైన రోడ్లు, లగ్జరీ కార్లకు కేరాఫ్ గా మారిన దుబాయ్ ను చూడగానే మైమరచిపోయాడు. లంబోర్గిని హారికేన్ కారును రూ.లక్ష చెల్లించి రెండు రోజులకు అద్దెకు తీసుకున్నాడు. దుబాయ్ లో ఉండే కఠినమైన ట్రాఫిక్ రూల్స్ ను తెలుసుకోకుండా రోడ్లపై రివ్వున దూసుకుపోయాడు. దీంతో అసలు కథ మొదలైంది.

దుబాయ్ లోని రోడ్ల కూడళ్లలో ఏర్పాటుచేసిన స్పీడ్ గన్లు అధిక వేగంతో వెళుతున్న ఈ లంబోర్గిని వాహనాన్ని గుర్తించాయి. ఇలా కేవలం నాలుగు గంటల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ కారుకి రూ.32 లక్షల భారీ జరిమానా విధించి ట్రావెల్స్ కి పంపించారు. అది చూసిన కారు యజమాని లబోదిబోమంటూ, సమస్యను పరిష్కరించామంటూ ఇప్పుడు బ్రిటన్ ఎంబసీకి మొరపెట్టుకున్నాడు. 

More Telugu News